YOUTH COMMITS SUICIDE IN VISAKHA: లోన్ యాప్ ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేవలం 2 వేల రూపాయల కోసం లోన్‌యాప్ వేధింపులకు పాల్పడింది. చివరికి బాధితుడి భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి, బంధువులు, స్నేహితుల గ్రూపులకు పంపింది. దీంతో దీనిని తట్టుకోలేక మనస్తాపంతో విశాఖకు చెందిన నరేంద్ర అనే 21 ఏళ్ల యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన దారుణం బయటపడటంతో మృతుడి కుటుంబం పోలీసులకి ఫిర్యాదు చేశారు. విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖపట్నం అంగడి దిబ్బకు చెందిన నరేంద్ర గత నెలలో లోన్‌యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పులో 2 వేల రూపాయలు బకాయి ఉండటంతో, లోన్‌యాప్ నిర్వహకులు వేధింపులకు గురిచేశారు. అంతేకాకుండా భార్య ఫొటోలు మార్ఫింగ్ చేసి బంధువులు, స్నేహితులకు పంపడంతో మనస్తాపం చెందిన నరేంద్ర ఈ నెల 4వ తేదీన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కొద్ది నిమిషాలలోనే అనేక మెసేజ్‌లు: లోన్ యాప్ నిర్వాహకులు మృతుడి భార్య ఫోన్ నెంబర్‌కు అసభ్య ఫోటోలు పంపడంతో పాటు, అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారని, అవి తట్టుకోలేక పోయిన మృతుని భార్య ఈ విషయాన్ని నరేంద్రకు తెలియజేసింది. కొద్ది నిమిషాలలోనే అనేక మెసేజ్‌లను చేసిన లోన్ యాప్ బృందం, నరేంద్రను మానసికంగా చిత్రవధ చేసింది.