YOUTH ADDICTED TO GANJA: గంజాయి లభ్యత, విక్రయాలు, వినియోగం ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది. బహిరంగ మార్కెట్లో లభించే సామాన్య మత్తుపదార్థంగా గంజాయి మారిపోయింది. కొన్నిచోట్ల శివారు ప్రాంతాలు, మరికొన్ని చోట్ల ఇళ్లు, దుకాణాలు సైతం గంజాయి హాట్‌స్పాట్లుగా మారాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నిత్యం 10 నుంచి 50 కిలోల వరకు పట్టుబడుతున్న గంజాయిని సీజ్ చేయడం, నిందితులపై కేసులు నమోదు చేయడం వరకూ బాగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
బానిసవుతున్న యువత:చౌకగా లభించడంతో పాటు గంజాయి తీసుకున్న విషయం చుట్టుపక్కల వారు గుర్తించలేకపోవడం ప్రధాన కారణం. అంతే కాకుండా మద్యం కంటే సులువుగా తక్కువ సమయంలోనే మత్తు ఆస్వాధించే అవకాశం ఉండటంతో గంజాయికి యువత ఆకర్షితులవుతున్నారు. సరదాగా అలవాటు చేసుకుని అతితక్కువ సమయంలోనే బానిసలుగా మారుతున్నారు.
మానసిక వైఖరిలో విపరీత మార్పులు:గతంలో గంజాయి వినియోగించిన వారి ప్రవర్తనలో స్వల్ప మార్పులు కనిపించగా, ఇప్పుడు భారీస్థాయిలో చూస్తున్నాము. గంజాయిని మరింతగా ఆస్వాదించాలనే తాపత్రయంతో మోతాదుకు మించి పీలుస్తూ గొడవలు, ఘర్షణలకు దిగుతున్నారు. ప్రధానంగా మానసికంగా వికార స్వభావం ప్రదర్శిస్తూ ఎదుటి వ్యక్తి ఊహించని విధంగా దాడులకు పాల్పడుతున్నారు.
సెంట్రల్ జైలులో గంజాయి కలకలం - లంచ్ బాక్స్‌తో దొరికిన ఫార్మాసిస్టు
జోరుగా రిటైల్, హోల్‌సేల్ వ్యాపారం:తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. విశాఖ, పాడేరు ప్రాంతాల్లో కిలో 2 నుంచి 3 వేల రూపాయలకు కొనుగోలు చేశాక, తిరుపతికి చేర్చేందుకు 10 వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రిటైల్ వ్యాపారులు గ్రాముల్లోకి తీసుకొచ్చి 10 గ్రాముల గంజాయి 500 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.