Young Man Suspicious Death: అనంతపురం జిల్లా తాటిచెర్ల సమీపంలో రైల్వే పట్టాలపై తోపుదుర్తి మహేష్ రెడ్డి అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తాటిచెర్ల గ్రామానికి చెందిన యువకుడు తోపుదుర్తి మహేష్ రెడ్డికి రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులైన రాజశేఖర్ రెడ్డి, చంద్రరెడ్డితో విభేదాలు ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో తనను వైఎస్సార్సీపీ నాయకులు ఇబ్బంది పెట్టినట్లు తన ఫేస్బుక్ ఖాతాలో తోపుదుర్తి మహేష్ పోస్టు చేశారు.
వారం రోజుల క్రితం తోపుదుర్తి మహేష్ రెడ్డి టీడీపీ నేత పరిటాల శ్రీరామును కలిశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సోదరుడు తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు తోపుదుర్తి మహేశ్ రెడ్డి ఫేస్బుక్లో 16వ తేదీన పోస్టు చేశారు. శనివారం రాత్రి తన మిత్రులతో కలిసి బయటకు వెళ్లిన తోపుదుర్తి మహేష్ రెడ్డి, ఆదివారం ఉదయం రైలు పట్టాలపై మృతి చెంది ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహేష్ రెడ్డి మృతి పట్ల అనుమానం ఉందని, పోలీసులు దర్యాప్తు చేసి నిజాలు బయటకు తీయాలని డిమాండ్ చేశారు.
తమకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబసభ్యులపై అనుమానం ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు మహేష్ రెడ్డిని తీవ్ర ఇబ్బందులు పెట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పారు. మహేష్ రెడ్డి మృతి పట్ల రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.