Yeleru Flood is Having Severe Impact in Pithapuram Constituency :కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నాలుగో రోజూ ఏలేరు వరద తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటి ఉద్ధృతిలో గోల్లప్రోలు-పిఠాపురం జాతీయ రహదారి మునిగింది. రాకపోకలు స్తంభించాయి. పోలీసులు వాహనాలను పిఠాపురం ప్రధాన కూడలి సమీపంలో ఆపేసి అచ్చంపేట జంక్షన్ మీదుగా మళ్లించారు. విశాఖ నుంచి కాకినాడ వెళ్లే వాహనాలను కత్తిపూడి జాతీయ రహదారి మీదుగా పంపుతున్నారు. పిఠాపురం-గొల్లప్రోలు రహదారి మీదుగా కేవలం భారీ వాహనాలు మాత్రమే పంపిస్తున్నారు. కార్లు ద్విచక్ర వాహనదారులను పోలీసులు నిలిపేస్తున్నారు.
గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లోని పొలాలు నీటిలోనే నానుతున్నాయి. జాతీయ రహదారి వెంట ఉన్న గృహాలు, దుకాణాలు, ఆలయాలు నీటమునిగాయి. గ్రామాల్లో పశువులను జాతీయ రహదారి వద్దకు తీసుకువచ్చి సంరక్షించుకుంటున్నారు. గొల్లప్రోలు మండలంలోని జగనన్న కాలనీ, సూరంపేట, ఎస్సీపేట, పిఠాపురం మండలంలోని రాపర్తి, రాయవరం, బి.ప్రత్తిపాడు, కొత్తపల్లి మండలంలోని ఇసుకపల్లి, నాగులపల్లి, రమణక్కపేట గ్రామాలు నీట మునిగాయి.
వరద తాకిడికి అన్నదాత విలవిల- నీటిపారుదల శాఖకు సవాల్‌గా గండ్ల పూడ్చివేత - CANALS DAMAGE IN GUNTUR
ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు విలీన మండలాల్లోని గ్రామాలు గోదావరి వరదలో మునిగాయి. వింజరం, చీరవెల్లి మధ్య ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తోంది. కుకునూరు మండల కేంద్రానికి రాకపోకలు నిలిచాయి. విలీన మండలాల్లో 25 గ్రామాలకు రెండు రోజులుగా రాకపోకలు స్తంభించాయి. పంట పొలాలు సైతం నీట మునిగాయి.