YCP Leaders Election Code Violation :ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన వద్దని ఎన్నికల కమిషన్ అధికారులు ఎన్ని సార్లు సూచించినా వారు లెక్కచేయడం లేదు. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతూ వైసీపీ కార్యక్రమాలలో ఉద్యోగులు మాస్కులు ధరించి మరీ పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంలో వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలోనే తనకల్లు మండలంలో కొక్కంటి క్రాస్ వద్ద సిద్ధారెడ్డి ఫంక్షన్ హాల్లో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు చంద్రమౌళి, వాలంటీర్లు, ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
పిల్లలతో వైసీపీ ప్రచారం :వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని ఒకటో డివిజన్లో మంగళవారం వైసీపీ నాయకులు పాఠశాల విద్యార్థులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం పిల్లలతో ఎన్నికల ప్రచారానికి వినియోగించడం, ర్యాలీల్లో పాల్గొనేలా చేయడం నిషేధం. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కడప మేయర్ సురేష్‌బాబు, వైసీపీ నాయకులు పిల్లల మెడలో పార్టీ కండువాలు వేసి, టోపీలు పెట్టి జగన్ చిత్రపటాలతో ప్రదర్శన నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.