YCP Govt Has Avoided concessions of Granite Industries: జగన్ సర్కార్ తీరు చూస్తుంటే పరిశ్రమలపై కక్షగట్టిందేమో అనిపిస్తుంది. ఐదు సంవత్సరాల పాలనలో కొత్త పరిశ్రమలు తీసుకురాలేదు సరికదా, ఉన్న వాటిని తరిమేశారు. ఎంతో మందికి ఉపాధి కల్పించే గ్రానైట్ పరిశ్రమలకు తాళం వేయించేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీల్ని ఎగ్గొట్టిన ప్రభుత్వం యాజమాన్యాలపై విద్యుత్ ఛార్జీలు, రకరకాల రుసుములతో బాదుడు బండ మోపి ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది. రీసర్వే కోసం తయారు చేసిన రాళ్లను ప్రభుత్వం తీసుకోకపోవడంతో యజామాన్యాలు రోడ్డున పడే దుస్థితి నెలకొంది. ఫలితంగా మేం పరిశ్రమలు నడపలేం మహాప్రభో అంటూ యాజమాన్యాలు ముూసివేత బాటపట్టాయి.
వేల మందికి ప్రత్యక్షంగా, లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే గ్రానైట్ పరిశ్రమను వైసీపీ సర్కారు ముంచేసింది. జగన్ అధికారం చేపట్టగానే గ్రానైట్ లీజుల్లో తనిఖీల పేరిట వేధింపులు మొదలుపెట్టారు. భారీ జరిమానాలతో బెదిరించి లీజుదారులను దారికి తెచ్చుకున్నారు. కొందరు తమ లీజులను అధికార పార్టీ వాళ్లకు అమ్ముకోవాల్సి వచ్చింది. మరికొందరు వైసీపీ నేతలకు భాగస్వామ్యం కల్పించారు. ఇలా దారికొచ్చిన వారికే జరిమానాల నుంచి అధికారులు ఉపశమనం కలిగించారు. గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్ల విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. పరిశ్రమల మనుగడకు సహకారం అందించకుండా విద్యుత్ ఛార్జీలు, ఇతర రుసుములు పేరిట బాదేస్తున్నారు. రాయితీలను ఆపేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వేల గ్రానైట్ పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంది.
వైసీపీ హయాంలో చిక్కుల్లో సూక్ష్మసేద్యం - రెండు నుంచి ఐదో స్థానానికి దిగజార్చిన వైనం
ప్రకాశం, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి తదితర జిల్లాల్లో దశాబ్దాల తరబడి గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. వేల మందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమలకు గత ప్రభుత్వాలు మద్దతుగా నిలిచాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యంత్రాలకు విద్యుత్ వినియోగం ఎక్కువ. ఇప్పుడీ విద్యుత్ ఛార్జీలే తలకు మించిన భారమయ్యాయి. గతంలో యూనిట్ ధర 6 రూపాయల 50 పైసలు ఉండగా ఇప్పుడది ట్రూఅప్ ఛార్జీలు, ఇతరత్రాలతో కలిపి ప్రస్తుతం 9 రూపాయలకు చేరింది. విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు రూ.6.50 పైసల నుంచి రూ.3.50 పైసలు చేస్తానని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక దాని గురించి పట్టించుకోలేదు. రెండేళ్ల కిందట హడావిడిగా యూనిట్‌కు 2 రూపాయలు తగ్గిస్తున్నట్లు ఉత్తర్వులిచ్చినా దానిని అమలు చేయలేదు. కొవిడ్ సమయంలో గ్రానైట్ పరిశ్రమలకు మూడు నెలల విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మొత్తం 187 కోట్లు కాగా ఇప్పటికీ వాటిని చెల్లించలేదు. పరిశ్రమల ప్రోత్సాహకాల కింద ఇచ్చే సొమ్మును మూడేళ్లుగా విడుదల చేయడం లేదు. విద్యుత్ బిల్లులో 25 శాతం, బ్యాంకు రుణవడ్డీలో పావలా రాయితీగా ఇవ్వాలి. కొత్తగా ఏర్పాటు చేసిన పరిశ్రమలకు పెట్టుబడి రాయితీనీ చెల్లించాలి. వీటిని కూడా వైసీపీ ప్రభుత్వం విడుదల చేయడం లేదు.