YCP Government not Utilized Fish Market in Vijayawada : రాజుల సొమ్ము రాళ్లపాలు, ప్రభుత్వం సొమ్ము వృథాపాలు అంటే ఇదేనేమో. పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాలెన్నో. అలాంటిది విజయవాడ జక్కంపూడి హౌసింగ్ కాలనీలో లక్షలాది రూపాయలతో నిర్మించిన ఆధునిక చేపల మార్కెట్‌ను గత ఐదేళ్లుగా వృథాగా మార్చేశారు. దుకాణాలు కేటాయించకపోవడంతో ఆ భవనాలు వృథాగా పడిఉన్నాయి. వినియోగంలోకి తెచ్చేందుకు పట్టించుకునే నాథులే కరవయ్యారు.
ప్రభుత్వ సొమ్ము వృథాాపాలు : విజయవాడ జక్కంపూడి హౌసింగ్ కాలనీలో ప్రారంభించిన ఆధునిక చేపల మార్కెట్ వైెఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లుగా వినియోగంలో లేకుండా చేశారు. లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలను నిరుపయోగంగా వదిలేశారు. జక్కంపూడి హౌసింగ్ కాలనీ వాసుల సౌకర్యార్థం గతంలో చేపల మార్కెట్ నిర్మించగా 2017లో అప్పటి మంత్రి దేవినేని ఉమ ప్రారంభించారు. జాతీయ మత్స్య సంపద అభివృద్ధి సంస్థకు చెందిన 53 లక్షల రూపాయల నిధులతో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు మార్కెట్ నిర్మాణం చేపట్టారు. అధికారులు నిబంధనల ప్రకారం దుకాణాలు కేటాయించేందుకు టెండర్లు పిలిచారు. ప్రభుత్వం మారడంతో అధికారులు ఎవరూ వాటిని పట్టించుకోలేదు. దీంతో ఆధునికీకరించి నిర్మించిన మార్కెట్‌ను వృథాగా మార్చేశారు.
Pandugappa Fish: మత్స్యకారులకు పంట.. ఒక్క చేపకు భారీ ధర.. దీని రుచి మాత్రం..!
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దుకాణాల కేటాయింపు లేకపోవడంతో వాటిల్లో ఆకతాయిలు చేరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పిచ్చిమొక్కలు మొలిచి మార్కెట్ పరిసరాలు అధ్వానంగా తయారయ్యాయి. ప్రస్తుతం కాలనీలోని ప్రధాన రోడ్లపై చేపల విక్రయాలు చేస్తున్నారు. జక్కంపూడి హౌసింగ్ కాలనీలో సుమారు 20వేల మందికి పైగా ప్రజలు నివాసముంటున్నారు. కనీసం మత్స్యకారులకైనా ఆ దుకాణాలను కేటాయించినా వారు ఉపాధి పొందే అవకాశం ఉండేది. తక్షణమే భవనాన్ని వాడుకలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.