World Telugu Writers Conference in Vijayawada :మాతృ భాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు తెలుగు తల్లి విగ్రహానికి అంజలి ఘటించారు.
ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, మండలి బుద్ధ ప్రసాద్, విశ్వహిందీ పరిషత్తు జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఈనాడు ఏపీ సంపాదకుడు ఎం. నాగేశ్వరరావు, తెలంగాణ శాసనమండలి సభ్యుడు, కవి గోరటి వెంకన్న, సినీ గేయ కవి భువనచంద్ర, ఆచార్య కొలకలూరి ఇనాక్ తదితరులు మహాసభల్లో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు మహనీయుల ఫొటో ప్రదర్శనను అతిథులు తిలకించారు.
నగరంలోని కె.బి.ఎన్.కళాశాల ప్రాంగణంలో నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకల కోసం దేశవిదేశాల నుంచి 1500 మందికి పైగా కవులు, రచయితలు, భాషాభిమానులు తరలివచ్చారు. పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలోని చెరుకూరి రామోజీరావు ప్రధాన వేదికతో పాటు మరో రెండు వేదికలనూ సదస్సులు, కవితా, సాహిత్య సమ్మేళనాల కోసం సిద్ధం చేశారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం, కె.బి.యన్.కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు.
మహాసభల్లో భాగంగా చెరుకూరి రామోజీరావు ప్రధాన వేదికతో పాటు మరో రెండు వేదికలపై రెండు రోజుల్లో 25కు పైగా సదస్సులు, కవితా, సాహిత్య సమ్మేళనాలు జరుగుతాయి. వీటిలో 800 మందికి పైగా భాషాభిమానులకు వేదికలపై పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. వెయ్యి మందికి పైగా దివంగతులైన ప్రముఖ కవుల ముఖచిత్రాలతో మహాసభల ప్రాంగణంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రాంగణంలోని అన్ని ప్రాంతాల్లోనూ కనిపించేలా దారిపొడవునా కవుల ముఖచిత్రాలే దర్శనమిస్తున్నాయి.
రాజకీయ, న్యాయ, పరిపాలనలో తెలుగు ప్రాధాన్యం పెంచే దిశగా ప్రత్యేక సదస్సులు జరుగుతాయి. పత్రికలు, ప్రసార మాధ్యమాలు, ప్రచురణ సంస్థల్లో మాతృభాష ప్రాధాన్యంపైనా సదస్సులు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాలు, మహిళా ప్రతినిధులకు ప్రత్యేకంగా సదస్సులు, తెలుగు భాషా పరిశోధనపై, సాహితీ, విద్యారంగ ప్రముఖులు, భాషోద్యమం, శాస్త్రసాంకేతిక రంగం ఇలా అన్నింటిలోనూ మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలనే కోణంలో కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించనున్నారు.
తెలుగు భాషను కాపాడుకుందాం. ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే నినాదంతో ఐక్యత చాటేందుకు నలుమూలల నుంచి విజయవాడకు తరలివచ్చిన వారందరికీ వందనాలు అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలో జరుగుతున్న మహాసభల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు.