3 Feets Punganuru Cow Cart in Konaseema District: కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పశువులంక గ్రామంలో 3 అడుగులున్న పుంగనూరు గిత్త ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన కిరణ్ ఈ గిత్తను పెంచుకుంటున్నారు. కనుమ సందర్భంగా గిత్తను అందంగా అలంకరించిన చిన్న బండిని కట్టారు. దానిపై తన కుమార్తెలను కూర్చొబెట్టి ఊర్లో తిప్పారు. అలాగే మురమళ్లలో జరుగుతున్న కోడి పందేల బరి వద్ద స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు బండిపై కూర్చుని సవారి చేశారు.
కోనసీమ జిల్లాలో అంబరాన్నంటిన సంబరాలు
సంక్రాంతి సంబరాలు కోనసీమ జిల్లాలో అంబరాన్నంటాయి. మూడు రోజుల పాటు కోడిపందేలు, ఇతర వేడుకలు జరిగాయి. మూడో రోజు కనుమ పండుగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభల ఉత్సవాలు సాగాయి. కోనసీమ జిల్లాలోని అంబాజీపేట, అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, కొత్తపేట, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లోని 170 గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంగా ప్రభల తీర్థం సాగింది.
కోనసీమ జిల్లాలో ప్రభల సందడి - పోటెత్తిన భక్తులు
అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం, గున్నేపల్లి అగ్రహారం ప్రభలు రాష్ట్రంలోనే ఎత్తైన ప్రభలుగా గుర్తింపు పొందాయి. అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో 423 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రభలతీర్థం నిర్వహిస్తుండగా.. టన్నుల కొద్దీ బరువున్న ప్రభలను జగ్గన్నతోట తీర్థ స్థలికి యువకులు, గ్రామస్థులు భుజాలపై మోసుకొచ్చారు. భక్తజనులు వాటి వెంట తరలిరాగా మేళతాళాల మధ్య ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కనుమ రోజున ఏకాదశ రుద్రులు కొలువుదీరేది దేశం మొత్తం మీద జగ్గన్నతోటలోనే అన్నది భక్తుల విశ్వాసం.