World Mental Health Day 2024 : నేటి కాలంలో మానసిక అనారోగ్యం అందరినీ ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు మానసిక ఎదుగుదల లేక ఇబ్బందులు పడుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు పనిలో ఒత్తిడితో పెద్దలు సైతం మానసిక అనారోగ్యానికి లోనవుతున్నారు. వయసు పెరుగుతున్న నేపథ్యంలో మానసిక రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
మరోవైపు పనిచేసే ప్రదేశాల్లో ఒత్తిడి పెరుగుతోందని ఓ సర్వేలో తెేలింది. అందులో ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఒత్తిడికి గురవుతున్నారు. వీరిలో నలుగురు వరకు మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు. అందులోనూ ఇప్పుడు భార్య, భర్త ఉద్యోగం చేయడం పరిపాటిగా మారింది. శారీరక శ్రమ పెద్దగా లేకపోయినా మానసికంగా ఉండే ఒత్తిడితో అనారోగ్యానికి చాలామంది లోనవుతున్నారని సైకాలజిస్టులు అంటున్నారు.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పనిచేసే ప్రదేశంలో మానసిక ఆనందం అందించాలన్న నినాదంతో ప్రచారం మొదలైంది. మానసిక సమస్యలు ఉంటే చిన్నారులకు వైద్యంతో పాటు పెద్దలకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందించేలా చర్యలు చేపడుతున్నారు. పీహెచ్‌సీలకు సైకాలజిస్టులను రప్పించి చికిత్స అందిస్తున్నారు. వైద్య సలహాల కోసం 14416 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారు. వారు వైద్యం కోసం సలహాలు సూచనలు ఇస్తారు.
Stress and Anxiety Reasons :అదేవిధంగా ఒత్తిడిని అధిగమించడానికి సహచరులతో మాట్లాడటం, కోపాన్ని తగ్గించుకోవడం, ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండటం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆఫీసు విషయాలు ఇళ్లలో ప్రస్తావించకుండా, ఖాళీ సమయాల్లో కుటుంబ సభ్యులతో గడపాలని వారు అంటున్నారు.
కొన్ని ఉదాహరణలను పరిశీలిస్తే :
- అనకాపల్లిలోని ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్‌కు ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో ఉన్నట్టుండి అరవడం, కేకలు వేయడం చేస్తున్నారు. ఇదివరకు ఆయన చాలా ప్రశాంతంగా ఉండేవారు. ఇప్పుడు ఈయన ప్రవర్తనలో మార్పు రావడంతో సైకాలజిస్టుకు చూపించుకోగా ఆయన కొన్ని సలహాలు ఇచ్చి మందులు వాడమని చెప్పారు.
- మునగపాకకు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు అక్షరాలను రివర్స్‌లో రాస్తున్నాడు. ఇలా చాలాకాలంగా చేస్తున్నాడని అనకాపల్లిలోని బాలల సత్వర చికిత్స కేంద్రానికి తీసుకొచ్చారు. ఇదొక మానసిక రుగ్మత అని కౌన్సెలింగ్ ఇచ్చి చికిత్స అందిస్తున్నారు.
- అనకాపల్లికి చెందిన ఎనిమిదేళ్ల కుర్రాడు మొండిగా తయారయ్యాడు. ఎవరికైనా ఎదురు చెప్పడం, దుర్భాషలాడడం, తగాదాలకు దిగడం చేస్తున్నాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకురాగా తల్లిదండ్రులు గొడవలు పడడం చూసి పిల్లలు ఇలా తయారైనట్లు గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
సకాలంలో గుర్తించాలి : మానసిక ఎదుగుదల లేని చిన్నారులకు సకాలంలో గుర్తించి చికిత్సకు తీసుకురావాలని డీఈఐసీ సెంటర్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ క్రాంతి తెలిపారు. అనకాపల్లి, నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలల సత్వర చికిత్స కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. మానసిక ఎదుగుదల లేని చిన్నారులు వారంలో పది మంది వరకు కేంద్రాలకు వస్తున్నారని పేర్కొన్నారు. వీరికి చికిత్స అందిస్తున్నామన్నారు. కౌన్సెలింగ్ థెరపీ ద్వారా చిన్నారుల ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చని వివరించారు.
అనకాపల్లిలోని ప్రైవేట్ ఫైనాన్స్ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తికి లక్ష్యాలు పూర్తిచేయక వస్తున్న ఒత్తిడితో ఆత్మహత్యకు యత్నించాడని ఎన్సీడీ పీవో డాక్టర్ ప్రశాంతి వివరించారు. స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలను రక్షించి మరో ఉద్యోగంలో చేర్పించారని పేర్కొన్నారు. ఇలా మానసిక సమస్యలతో బాధ పడుతున్న వారు వైద్య సలహాల కోసం 14416 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయొచ్చని వెల్లడించారు.
ఒత్తిడిని తగ్గించే యోగాసనాలు- మీరు ట్రై చేస్తారా? - Yoga for Stress Relief
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? 'ఒత్తిడి'ని చిత్తు చేసి, విజయాన్ని చేకూర్చే గొప్ప మంత్రం ఇదే! - Stress Management Tips