Lagacharla Incident : లగచర్ల ఘటన తర్వాత అక్కడి మూడు గ్రామాల్లో జనసంచారం కనిపించడం లేదు. విచారణ పేరుతో పోలీసులు ఎప్పుడు వచ్చి ఎవరిని పట్టుకుపోతారోనని తీవ్ర భయాందోళనలతో గడుపుతున్నారు. సోమవారం ఘటన జరిగితే ఇప్పటికీ పురుషులు ఇళ్లకు రాకుండా దూర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మహిళలు సైతం పిల్లలను తీసుకొని ఉదయం పొలానికి వెళుతున్నారు. సాయంత్రం వరకు అక్కడే గడిపి రాత్రికి బిక్కుబిక్కుమంటూ ఇళ్లకు చేరుకుంటున్నారు. లగచర్లలో అయితే కొద్ది మంది జనం అటూఇటూ తిరుగుతూ కనిపించారు కానీ పులిచర్లకుంట తండా, రోటిబండ తండాలు బుధవారం కూడా నిర్మానుష్యంగానే కనిపించాయి.
34 మంది సేఫ్ : ఘటన తర్వాత సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 50 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ అనంతరం మంగళవారం 16 మందిని రిమాండ్‌కు తరలించారు. మిగిలిన 34 మందిని విడిచిపెట్టారు. దీంతో వీరంతా ఇళ్లకు చేరుకోవడంతో వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రధాన నిందితుడు సురేష్‌తో పాటు మరికొంత మంది పరారీలో ఉన్నట్లు సమాచారం.
3వ రోజు నిలిచిపోయిన ఇంటర్ నెట్ సేవలు : లగచర్లలో ఘటన జరిగిన తర్వాత సోమవారం రాత్రి 10 గంటల నుంచి అంతర్జాల సేవలను నిలిపివేశారు. అప్పటి నుంచి ఆ సేవలను పునరుద్ధరించలేదు. దీంతో మీ సేవ కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. అలాగే తహసీల్దార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇంటర్ నెట్ గురించి కొందరు గ్రామాల నుంచి బయటకు వెళుతున్నారు.
ప్రత్యేక బలగాలు మకాం : జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసుల బలగాలు బొంరాస్‌పేట పోలీస్ స్టేషన్లో ఉంటున్నాయి. ఎందుకంటే అవసరం పడితే వెంటనే అక్కడకు పోలీసులు వెళ్లేలా ఉన్నతాధికారులు బలగాలను అక్కడే ఉంచారు.
కొడంగల్ కోర్టు బయట మోహరించిన టీఆర్ఎస్ శ్రేణులు : లగచర్ల ఘటన నేపథ్యంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బుధవారం పోలీసులు ఏ-1గా కేసు నమోదు చేయడం తదితర పరిణామాలతో వికారాబాద్ జిల్లా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనను తొలుత వికారాబాద్ జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి (డీటీసీ) విచారణ నిమిత్తం తరలించగా.. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అలాగే భారో బందోబస్తును ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకున్న వికారాబాద్, పరిగి మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేష్‌రెడ్డి అక్కడి చేరుకోగా, పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు.