ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు అప్పులతో సతమతం - నేడు సిరులతో కళ కళ! - YSRCP Leader Irregularities - YSRCP LEADER IRREGULARITIES

Woman YSRCP Leader Irregularities: చలనచిత్ర రంగంలోనే కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ 'సినిమా'లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. రెండోసారి నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో ఆమె జాతకం మారిపోయింది. అనతి కాలంలోనే రూ.వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారు.

Women YSRCP Leader Irregularities
Women YSRCP Leader Irregularities

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 10:24 AM IST

Updated : Apr 19, 2024, 11:40 AM IST

నాడు అప్పులతో సతమతం - నేడు సిరులతో కళ కళ!

Woman YSRCP Leader Irregularities :ఆమె పేరు వినగానే ప్రతిపక్షనేతలేమో 'ఆ నోటికి ఎదురెళ్లలేం బాబోయ్‌' అనీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులైతే 'కప్పం కట్టలేక చస్తున్నాం' అనీ కొండలకే మాటలొస్తే 'కుళ్లబొడుస్తూ గుల్ల చేస్తున్నారు' అనీ నదులేమో 'ఇసుకను తోడేస్తూ కొల్లగొట్టేస్తున్నారు' అనీ స్థానిక నేతలేమో 'మేమూ ముడుపులు చెల్లించాల్సి వస్తోంది' అనీ గగ్గోలు పెట్టేలా ఉంటుందా మహానటి తీరు. రాజకీయాల్లోనూ సెలెబ్రిటీగా భావిస్తుంటారు. ఒకప్పుడు అప్పుల్లో మునిగిన ఆమె ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. జగనన్నా అంటూ అవినీతి, అక్రమాల్లో ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నారు!

చలనచిత్ర రంగంలోనే కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ 'సినిమా'లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. రెండోసారి నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా విజయం సాధించారు. కానీ, ఆ వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధికి నోటి దురుసు కాస్త అనడం కంటే ఎక్కువ అనడమే సబబేమో! ప్రతిపక్ష నేతలపై ఇష్టమొచ్చినట్లు విరుచుకుపడే ఫైర్‌ బ్రాండ్‌. అందుకే ఆమె పేరు చెబితేనే 'వామ్మో ఆ నోటికి ఎదురెళ్లగలమా?' అంటూ అధికార పార్టీ వారూ ఉలిక్కిపడతారు. అప్పట్లో సినిమాల్లో, ఇప్పట్లో టీవీ కార్యక్రమాల్లో మెరిసినా, రెండుసార్లు ప్రజాప్రతినిధిగా పనిచేసే అవకాశాన్ని ప్రజలు ఇచ్చినా, వెనకబడిన నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదనే విమర్శను మూటగట్టుకున్నారు. అసభ్య పదజాలాన్నీ నిరభ్యంతరంగా వినియోగించడంలో ముందుండే ఈ నేతకు అయిదేళ్ల కిందట ఎటు చూసినా అప్పులే. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో ఆమె జాతకం మారిపోయింది. అనతి కాలంలోనే రూ.వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారు.

నియోజకవర్గాన్ని ప్రజలంతా ఆమెకు రాసిచ్చారని అనుకున్నారేమో రాష్ట్రస్థాయి పదవి దక్కడంతో దాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీకి రాచబాటలు వేశారు. మండలాలు, పురపాలక సంఘం లెక్కన భర్త, సోదరులకు ధారాదత్తం చేశారు. కొండల్ని పిండి చేసి మట్టిని, నదుల నుంచి తోడేసి ఇసుకను తరలించి రూ.కోట్లలో ఆర్జించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన అసభ్య వ్యాఖ్యలతో శాసనసభ పవిత్రతనూ మంటగలిపిన ఘనతను మూటగట్టుకున్నారు. సీఎం సహాయనిధి (CM Relief Fund) కింద ఇచ్చే చెక్కుల్నీ ఈ ప్రజాప్రతినిధి వదల్లేదు. అప్పలాయగుంటలో సహాయనిధి కింద రూ.3లక్షలు వస్తే, అది ఇచ్చేందుకు రూ.35వేలు వసూలు చేశారు.

నగరిలో రోజా దోపిడీకి అడ్డేలేదు- ఆమె ఇంట్లో నలుగురు మంత్రులు : షర్మిల - YS Sharmila on Roja

బెంజ్‌ కొనే స్థాయి :డబ్బు ఇవ్వనిదే చెక్కు బాధితుల చేతికి ఇవ్వలేదంటే ఆమె అరాచకం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో దొరికినచోటల్లా అక్రమాలకు పాల్పడి అనతి కాలంలోనే హైదరాబాద్‌, తిరుపతి, అమరావతి, బెంగళూరు, చెన్నైలలో ఇళ్లు, స్థలాలు, భూములను వెనకేసుకున్నారు. గతంలో అంతా నష్టపోయి అప్పుల్లో మునిగిన ఆమె ఇటీవల పుట్టినరోజు సందర్భంగా బెంజ్‌ కొనే స్థాయికి ఎదిగిన తీరు చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఆ చిత్రాలు సోషల్‌ మీడియాలోనూ తెగ వైరల్‌ అయ్యాయి.

భూములు సేకరించి రూ.కోట్లలో అక్రమాలు :వైసీపీ నుంచి ఈ సెలెబ్రిటీ రెండోసారి ప్రజాప్రతినిధి అయ్యాక ప్రతి పనికీ వసూలు చేసే విధానంతో భారీగా దండుకున్నారు. ఆమె దోపిడీపై ప్రజల్లోనే తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. తనకు వ్యతిరేకంగా మాట్లాడే సొంత పార్టీ నేతలనే దూరంగా పెట్టారు. పాదిరేడు అరణ్యం, విజయపురంలోని కోసలనగరంలో పారిశ్రామిక వాడలు తీసుకొస్తామని భూములు సేకరించి రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారు. విజయపురంలో తన అనుచరుల పేరుతో భూములకు నకిలీ పట్టాలు సృష్టించి, ఆ తర్వాత వాటిని ఏపీఐఐసీకి అప్పగించి రూ.కోట్లు మింగేశారు. ఇదొక్కటే కాదు రాష్ట్రస్థాయిలో చాలా చోట్ల ఏపీఐఐసీ ద్వారా జరిగిన భూసేకరణలో ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి-చెన్నై రహదారిపై ఎస్వీపురం టోల్‌ప్లాజా సమీపంలోని భూదానోద్యమ భూమికి ప్రభుత్వం నుంచి ఎన్‌వోసీ ఇప్పించేందుకు భారీగా ప్రయోజనం పొందినట్లు తెలిసింది.

కుటుంబానికి కప్పం కట్టాల్సిందే :మండలాల వారీగా వసూళ్ల బాధ్యతల్ని భర్త, సోదరులకు అప్పగించారామె. తమ పరిధిలోని మండలాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఎక్కడైనా కొత్త వెంచర్‌ వేశారంటే ఈ బంధు గణానికి కప్పం గట్టాల్సిందే. పుత్తూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అయిన ఓ మాజీ ప్రతినిధికి సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆపివేయించి ఆ తర్వాత ముడుపులతో సర్దుబాటు చేసుకున్నారు. లెక్కలు తేలకపోవడంతో పుత్తూరు సమీపంలో తిరుపతి-చెన్నై జాతీయ రహదారి పక్కనే ఉన్న మరో భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ నిలిపేయించారు. అంజేరమ్మ కనుమ వద్ద తుడా లేఅవుట్‌ పక్కనే డి.పట్టా భూముల కొనుగోలు వ్యవహారంలోనూ ప్రజాప్రతినిధి సోదరుడి ప్రమేయం ఉందని చెబుతుంటారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆమె అనుచరులు సాగించే రేషన్‌ బియ్యం దందా అంతా ఇంతా కాదు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన బియ్యాన్ని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి రూ.కోట్లు గడిస్తున్నారు.

మంత్రి రోజాపై మున్సిపల్​ కౌన్సిలర్ సంచలన ఆరోపణలు - 40 లక్షలు మోసపోయానని ఆవేదన

అధికారుల బదిలీల్లోను చేతివాటం :విజయపురం మండలంలోని మహారాజపురం తదితర ప్రాంతాల్లో కొంత విస్తీర్ణంలో తవ్వకాలకు గ్రావెల్‌ క్వారీకి అనుమతి తీసుకుని అనధికారికంగా పెద్ద మొత్తంలో తవ్వేశారు. ఒక్క విజయపురం ప్రాంతం నుంచే తమిళనాడుకు రోజుకు 300 ట్రిప్పుల గ్రావెల్‌ను తరలించారు. బినామీ పేర్లతో అనుమతులు తీసుకొని చెన్నైలో విక్రయించారు. ఒక్కో లారీకి రూ.20వేల వరకు వసూలు చేశారు. అన్ని ఖర్చులు పోను రోజుకు రూ.2 లక్షల మేర వెనకేసుకున్నారు. వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట, అంజేరమ్మ కనుమ వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టలను పిప్పి చేశారు.

ఆ రాళ్లు, మట్టిని పూతలపట్టు-నాయుడుపేట రోడ్డు పనులు చేపడుతున్న గుత్తేదారులకు తరలించి భారీ ఎత్తున ఆర్జించారు. మండలాల్లోని చిన్నాచితకా నాయకులు కూడా ప్రజాప్రతినిధి సోదరులకు కప్పం కట్టాల్సిందే. కంకర, గ్రానైట్‌ క్వారీల యజమానుల నుంచి నెలవారీ మూమూళ్లు వసూలు చేయడంతోపాటు అధికారుల బదిలీల్లోను చేతివాటం ప్రదర్శించి రూ.కోట్లు వెనకేసుకున్నారు. నగరి నుంచి విజయపురం మండలంలోని కేవీ శ్రీరామపురం వరకు కుశస్థలి నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకను అక్రమంగా తవ్వేసి తమిళనాడుకు తరలించారు. అలా ఒక్కో లారీ ఇసుకకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేసి భారీగా లబ్ధి పొందారు.

పోస్టుకో రేటు :విద్యుత్తు సబ్‌స్టేషన్లలో షిఫ్ట్‌ ఆపరేటర్‌ ఒక్కో పోస్టును రూ.10లక్షల నుంచి రూ.15లక్షలకు అమ్ముకున్నారు. ఆఖరికి అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తల నియామకంలోనూ ఆమె చేతివాటం ప్రదర్శించారు. పుత్తూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా అవకాశం ఇస్తామని చెప్పి ఏకంగా రూ.53లక్షలు వసూలు చేసి చివరకు మోసం చేశారని ఓ మహిళ మీడియా సమక్షంలోనే వాపోయింది. విషయం బయటకు పొక్కడంతో రూ.13 లక్షలు తిరిగిచ్చారు. మిగిలిన సొమ్ము ఇవ్వకపోగా పోలీసులతో బాధితురాలిని బెదిరించడం గమనార్హం.

ట్రస్టు పేరుతో దోపిడీ :ఈ ప్రజాప్రతినిధి తన పేరుతో ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. దాని పేరిట ఆమె చేపట్టే సేవా కార్యక్రమాలేంటో ఎవరికీ తెలియదు. దానికి రిజిస్ట్రేషన్‌ ఉందో లేదో కూడా అంతుచిక్కని రహస్యమే. రాష్ట్రస్థాయి ముఖ్య పదవిలో నియమితులయ్యాక విశాఖపట్నంలోనే భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టారు. పుత్తూరు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు కట్ట కుంగిపోవడంతో తాత్కాలికంగా పనులు చేపట్టాలని అప్పటి కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో మున్సిపల్‌ సాధారణ నిధులు రూ.42 లక్షలు ఖర్చు చేశారు. చేసిన పనుల విలువ రూ.5లక్షలు కూడా లేదనీ, తాను బిల్లు చేయలేనని డీఈ ససేమిరా అనడంతో ఆయన్ను బదిలీ చేయించారు. తర్వాత వచ్చిన అధికారితో బిల్లులు చేయించుకున్నారామె.

జగన్ పాలనలో రైతులకు అష్టకష్టాలు- నగరిలో మంత్రి రోజా గ్రావెల్, ఇసుక దోపిడి వైఎస్ షర్మిల

Last Updated : Apr 19, 2024, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details