Woman Video Blackmail Case In Hyderabad: సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన మహిళల వద్ద ఫోన్ నంబర్ తీసుకొని మాటలు కలిపి పోకిరీలు వలపు వల విసురుతున్నారు. నగ్న వీడియోలను ఆయుధంగా మలచుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు. విశ్రాంత ఉద్యోగులు, వయోధికులు లక్ష్యంగా మోసాలకు దిగుతున్నారు. గౌరవంగా ఉన్నచోట సున్నిత అంశాలు బయటపడతాయనే భయంతో అడిగినంత ఇచ్చి బాధితులు బయటపడుతున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి, మల్టీఫ్లెక్స్ మాల్ యజమాని, జైలు ఉన్నతాధికారి వంటి ప్రముఖులు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. కొద్ది మంది మాత్రమే కేటుగాళ్ల బెదిరింపులకు లొంగకుండా ఫిర్యాదు చేస్తున్నారు.
యువతి ఫొటోలను మార్ఫింగ్ :తాజాగా చాంద్రాయణగుట్టలో ఉంటున్న కుర్రాడు దగ్గర బంధువనే భరోసాతో ఆస్తుల్లేకున్నా అదే ప్రాంతానికి చెందిన కుటుంబం అల్లుడిని చేసుకునేందుకు సిద్ధమైంది. కొద్దిరోజులకు అతడి వ్యవహారాలు బయటపడటంతో పెళ్లి రద్దు చేసుకుంది. పరువు పోయిందనే అక్కసుతో అతడు ఆ యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి రూపొందించిన నగ్నవీడియోలను ఆమె తల్లిదండ్రులకు పంపాడు. అవి బయటకు రాకుండా ఉండేందుకు డబ్బులివ్వాలని, కుదరకుంటే ఆ యువతినిచ్చి పెళ్లి చేయాలని డిమాండ్ చేశాడు. 2 నెలల మనోవేదన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పరిష్కారం దొరికింది.
నగ్నవీడియోలు తీసి బెదిరించి :హైదరాబాద్కు చెందిన ప్రైవేటు వసతిగృహ నిర్వాహకుడు హాస్టల్‌లో ఉండే తూ.గో జిల్లాకు చెందిన ఐటీ నిపుణురాలిని నగ్న వీడియోలు తీసి బెదిరించి రూ.2.53 కోట్లు కాజేశాడు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన గుట్టు నలుగురి నోళ్లలో చేరుతుందనే ఆలోచన భయపెడుతుంది. గౌరవంగా బతికేచోట అప్రతిష్ఠ పాలవుతామనే గుబులు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ బలహీనతలను ఆసరా చేసుకొని సైబర్ నేరస్థుల నుంచి ప్రేమికుల వరకూ సొమ్ము చేసుకుంటున్నారు.