Woman Suicide After Realizing She Was Cheated by Loan APP : ఓ సెల్ ఫోన్ పచ్చని కుటుంబాన్ని సర్వ నాశనం చేసింది. చరవాణిలో ఉన్న ఓ రుణ యాప్ కారణంగా అతివ ప్రాణాలు బలైపోయాయి. చిన్నారులకు తల్లిని లేకుండా చేసింది. కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఆన్‌లైన్ మోసానికి నిండు నూరేళ్ల జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ‘బావా తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు. నా ముఖం నీకు ఎలా చూపించగలను? రుణం విషయంలో మోసపోయాను. నాకు భయంగా ఉంది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ సెల్ఫీ తీసుకొని మరీ ఓ వివాహిత తనువు చాలించిన దారుణ ఘటన కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో చోటుచేసుకుంది.
సంక్షిప్త సందేశాలు చూసి :జిల్లాలోని మంటాడకు చెందిన పేటేటి స్రవంతి(28)కి చరవాణిలో రూ.5 లక్షలు రుణం ఇస్తామని ఒక సందేశం వచ్చింది. కష్టకాలంలో కుటుంబానికి ఉపయోగపడతాయన్న ఆశలో ఆ నంబరును సంప్రదించింది. రూ.5 లక్షలు రుణం ఇచ్చేందుకు తొలుత రూ.20 వేలు, తరువాత రూ.60 వేలు వరుసగా రూ.80 వేలు చెల్లించమంటే అప్పు తెచ్చి మరీ ఓ లక్ష చెల్లించింది. తర్వాత మరో రూ.1.20 లక్షలు చెల్లిస్తే మొత్తం రుణం ఇచ్చేస్తామంటూ మరో సందేశం రావడంతో తాను ఇక కట్టలేనని, మోసపోయానని ఆమె గ్రహించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పుకోలేకపోయింది. తాను తప్పు చేశాననే బాధతో భర్తకు ముఖం కుడా చూపించలేక భర్త శ్రీకాంత్‌ను ఉద్దేశించి సెల్ఫీ వీడియో తీసి అందులో జరిగిన విషయాన్ని పుట్టెడు దుఃఖంతో పంచుకుంది.