Extramarital Affair Murder in YSR Dist : నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు దాంపత్య బంధాన్ని కడతేర్చుతున్నాయి. ఓ వైపు ఆ మోజులో పడి కట్టుకున్న వాడిని కడుపున పుట్టిన వాళ్లను సైతం వదిలేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అడ్డొస్తే చంపడానికి సైతం వెనకాడటం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా క్షణిక సుఖాల కోసం కుటుంబాలను వీధిపాలు చేస్తున్నారు. తద్వారా జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయనడానికి ఈ ఘటనే ఓ ఉదాహరణ.
Siddavatam Extramarital Affair Case : తాజాగా వైఎస్సార్ జిల్లాలో ప్రియుడితో కలిసి ఓ భార్య భర్తను చంపింది. ఏమీ తెలియదనట్టు తన భర్త కనిపించకుండా పోయాడని నాటకం ఆడింది. చివరికి పోలీసుల దర్యాప్తులో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. సిద్ధవటం మండలం లింగంపల్లిలో గాజుల గంగయ్య, సంధ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అదే గ్రామానికి చెందిన బాలరాజుతో సంధ్యకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
రెండు రోజుల క్రితం సంధ్య, బాలరాజు ఇంట్లో ఉండటం గంగయ్య గమనించాడు. పద్ధతి మార్చుకోవాలని ఆమెను మందలిచాడు. దీనికి ఆగ్రహించిన సంధ్య కట్టుకున్నవాడిని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని అనుకుంది. ఈ క్రమంలోనే అదునుచూసి ప్రియుడితో కలిసి గంగయ్యను హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి రాయచోటి గువ్వలచెరువు ఘాట్‌లో పడేవేశారు. ఆ తర్వాత వారు ఏమీ తెలియనట్టు గ్రామానికి చేరుకున్నారు.