Wife Committed Suicide After Her Husband Death in Vijayawada :వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే మరొకరికి పంచప్రాణాలు. పెద్దలను ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కారు. కోటి ఆశలతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఎంతో అన్యోన్యంగా, ప్రేమ అనురాగాలతో మెలుగుతున్నారు. ఇలా తమ జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతున్న తరుణంలో రోడ్డు ప్రమాదం భర్తను కబళించింది. ఈ విషయాన్ని భార్య తట్టుకోలేకపోయింది. నీవు లేని ఈ లోకంలో నేను ఎందుకని భావించి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక సంఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.
ఏడాది కిందటే పెళ్లి :విజయవాడ నగర శివారులోని ప్రసాదంపాడుకు చెందిన రాచపూడి నాగరాజు స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో టిఫిన్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. నగరంలోని అయోధ్యనగర్‌కు చెందిన చల్లా ఉషను ప్రేమించారు. వీరి ఇద్దరూ సంవత్సరం కిందటే పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయోధ్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రతి రోజూ తన భర్త హోటల్‌కు సాయంత్రం 6 గంటలకు వెళ్లి రాత్రి 11 గంటల తర్వాత ఇంటికి వచ్చేవారు.
ఇంటికెళ్దాం లే కన్నయ్యా - మృతి చెందిన కుమారుడి పక్కన తల్లి రోదన
అతివేగం కారణంగా : రోజులాగే సోమవారం (అక్టోబర్ 7న) పనికి వెళ్లి, అర్ధరాత్రి అయినా ఇంటికి రాలేదు. మంగళవారం (అక్టోబర్ 8న) తెల్లవారుజామున 4 గంటల సమయంలో బి.ఆర్.టి.ఎస్.రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందినట్లు భార్యకు సమాచారం వచ్చింది. ఉష తన బంధువులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుంది. విగతజీవిగా పడిఉన్న భర్తను చూసేసరికి తట్టుకోలేక గుండెలవిసేలా రోదించింది. గుణదల కుమ్మరిబజారుకు చెందిన ఇద్దరు యువకులు బైక్ పై భానునగర్ కూడలి నుంచి పడవలరేవు వైపు రాంగ్ రూట్‌లో అతి వేగంగా వెళుతూ నాగరాజు బైక్‌ను ఢీ కొట్టారు. దీంతో వారు గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద తీవ్రతకు బైక్‌ల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
'మేమేం చేశాం అమ్మా' - ఇద్దరు చిన్నారులతో కాలువలోకి దూకిన తల్లి - Mother Commits Suicide
మళ్లీ వస్తానని ఇంటికి వెళ్లి :ఈ ఘటనపై మృతుడి భార్య ఉష గుణదల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఇంటికి వెళ్లొస్తానని ఉష తన తల్లి ఆదిలక్ష్మికి చెప్పి వెళ్లిపోయింది. ఉష ఎంత సేపటికి రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. దీంతో కుమార్తె ఇంటికి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. ఉష తల్లి ఆదిలక్ష్మి అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు సమాచారం అందించింది. వారు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. భర్త మరణాన్ని తట్టుకోలేక తన కుమార్తె ఉష ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదిలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఒకరి నిర్లక్ష్యం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదం ప్రేమికుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
ఆన్లైన్ బెట్టింగుల విషవలయం - కుమారుడి అప్పులు తీర్చలేక కుటుంబం బలవన్మరణం - Family Suicide Due to Betting Debts