Karthika Masam Deeparadhana 2024 :దీపం ప్రాణానికి ప్రతీక, జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం కూడా. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రప్రథమంగా దీపాన్ని వెలిగిస్తారు. దేవీదేవతల ముందు దీపం వెలిగించడమే దీపారాధన. దేవుడిని పూజించడం కంటే ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని పూజిస్తాం. షోడశోపచారాల్లో దీపారాధన ముఖ్యమైనది. అన్ని ఉపచారాలూ చేయలేకపోయినా ధూపం, దీపం, ప్రసాదాలను తప్పక చేయాలంటారు పెద్దలు.
దేవతలకూ వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం కూడా. అందుకే దీపాన్ని అర్చించిన వారికి లక్ష్మీకటాక్షం తప్పకుండా ఉంటుందంటారు. ఎన్నో విశిష్టతలకు నెలవైన దీపానికి కార్తిక మాసంలో మరింత ప్రత్యేకత దాగివుంది. అంతేకాదు దీపాన్ని ఎలా ఆరాధించాలి? దీపారాధన టైంలో ఎలాంటి నియమనిబంధనలు పాటించాలి? తదితర అంశాలను కూడా శాస్త్రాల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు.
సాధారణంగా మూడు అడ్డ వత్తులు లేదా బొడ్డు వత్తులను తయారు చేసి, ప్రమిదలో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వీటిని వెలిగిస్తారు. ప్రత్యేక పూజలూ నోములూ చేసేటప్పుడు అయిదు పోగులూ, తొమ్మిది పోగులూ, కమలవత్తుల పేరుతో ఎనిమిది పోగులూ.. ఇలా రకరకాలుగా వత్తులను ఎంతో ధ్యానంతో వెలిగిస్తారు. సాధారణంగా దీపారాధన సమయంలో కింది శ్లోకాన్ని పఠిస్తారు.
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం |
గృహాణ మంగళం దీపం త్రైలోక్యతి మిరాపహా||
భక్త్యా దీపం ప్రయాచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాంనర కాద్ఘోరా ద్దివ్యజ్యోతి ర్నమోస్తుతే ||
మూడు వత్తులు ముల్లోకాలకు ప్రతీక :మూడు వత్తులను తీసుకుని, నూనెలో బాగా తడిపి, అగ్నిని జతచేసి శుభప్రదమైన, ముల్లోకాలు చీకట్లను పోగొట్టగలిగిన దివ్య జ్యోతిని వెలిగించి, పరమాత్మకు భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకం నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను అని రోజూ దీపానికి ధ్యానిస్తాం. చిన్న దీపం పెట్టి అది నా ఇంటినే కాదు మూడు లోకాల్లోనూ వెలుగు నింపాలన్నది ఎంత ఉన్నతమైన భావన! మరెంతటి ఉదాత్తమైన ఆలోచన! దీపంలో ఉపయోగించిన మూడు వత్తులు ముల్లోకాలకీ, సత్వ రజ తమోగుణాలకూ, ఆ బ్రహ్మా-విష్ణు-మహేశ్వరులకూ, త్రిసంధ్యలకూ సంకేతంగా భావిస్తారు. పూజలో చేసే దీపారాధనకే కాదు సంధ్యా దీపానికీ ప్రముఖమైన స్థానాన్ని కల్పించింది సనాతన ధర్మం.
లోకానికి వెలుగునీ తేజస్సునీ ప్రసాదించే భాణుడు జీవులమీద దయతో వారికి జీవాన్నీ, శక్తినీ ప్రసాదించడానికి తాను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. అందుకే సర్వప్రాణులకూ ప్రాణప్రదాత అయిన ఆ సూర్య భగవానుడు అస్తమయం కంటే ముందుగానే ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పూర్వీకులు. తిరిగి సూర్యోదయం వరకూ దీపాన్ని వెలుగుతూ ఉంచడం హైందవ సంస్కృతిలో ఒక ఘట్టమే.
దీపం ముమ్మూర్తులా పరబ్రహ్మ స్వరూపమే. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తూ, పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని దహించడం. అంధకారమంటే.. కేవలం చీకటి మాత్రమే కాదు, మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే అవుతుంది! ఆ చీకట్లను పటాపంచలు చేసి, జ్ఞాన జ్యోతిని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి మరో రూపమే లక్ష్మీదేవి. అందుకే లోకంలో లక్ష్మీస్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ప్రధానమైనది. దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందన్నదానికీ ఒక స్టోరీ ఉంది. పూర్వం ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనై సకల సంపదలూ, అష్టఐశ్వర్యాలు కోల్పోతాడు. అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణు భగవానుడిని ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట. ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన అపూర్వ సంపదలను పొందాడనీ అప్పటినుంచే లక్ష్మీ దేవి దీపలక్ష్మీదేవి అయిందనీ చెబుతారు.