ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొంతులో పట్టేసిందా? కఫం పడుతోందా?- మార్కెట్లో కల్తీ వంట నూనె - లూజ్​గా కొంటే అంతే సంగతి! - ADULTERATED PALM OIL USAGE

లూజు విక్రయాల ద్వారా వంటింట్లోకి చేరి జనం ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న కల్తీ నూనెలు

wholesalers_selling_to_adulterated_palm_oil_to_retailers_across_two_telugu_sates
wholesalers_selling_to_adulterated_palm_oil_to_retailers_across_two_telugu_sates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2024, 12:18 PM IST

Wholesalers Selling to Adulterated Palm Oil to Retailers Across Two Telugu Sates :కడాయిలో ఆహార పదార్థాలు వేయగానే వేడి నూనె నురగతో పొంగి కిందకు పోతోందా ? వండిన పదార్థాలు వారం రోజులకే నూనె వాసన వస్తున్నాయా? తిన్న తరువాత గొంతులో పట్టేసినట్టు ఉంటోందా? కఫం పడుతోందా? అయితే మీరు వాడుతున్న వంట నూనె కల్తీ అయినట్టే.

వంటింట్లో పోపు పెట్టాలన్నా, ఏ కూర అయినా రుచిగా ఉండాలన్నా, అట్టు వేయాలన్నా, గారె వేయించాలన్నా వంట నూనెతోనే కదా. మరి ఆ నూనె నాణ్యమైంది కాకపోతే ఎలా? అనేక ప్రమాదకర వ్యాధులకు అదే మూల కారణమైతే ఏం చెయ్యగలం? ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కల్తీ నూనె అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. లూజు విక్రయాల ద్వారా వంటింట్లోకి చేరి జనం ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నాయి. కొన్నాళ్లుగా మార్కెట్లో నూనెల ధరలు మండిపోతుండడం కల్తీరాయుళ్లకు కలిసొచ్చింది. ఎక్కువ మంది వినియోగించే పామాయిల్‌ను కల్తీ చేసి జనానికి అంటగడుతున్నారు.

నురగతో పొంగి కిందకు పోతున్న నూనె (ETV Bharat)

ఇదో మాఫియా :ఉమ్మడి గుంటూరు జిల్లాలో పామాయిల్‌ వినియోగం ఎక్కువ. దీనిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం పెంచడంతో ధరలు బాగా పెరిగాయి. పామాయిల్‌ 910 గ్రాముల ప్యాకెట్‌ ధర రూ. 129 ఉండగా దీన్ని లూజుగా కిలో రూ. 145 వసూలు చేస్తున్నారు. వేరుశనగ నూనె ప్యాకెట్‌ ధర రూ. 150 కాగా, లూజుగా రూ. 154కు, పొద్దుతిరుగుడు నూనె ప్యాకెట్‌ ఖరీదు రూ. 135కాగా లూజుగా రూ. 155కు అమ్ముతున్నారు. అత్యధికులు వినియోగించే పామాయిల్‌లో తక్కువ ధరకు వచ్చే నూనెలను కలిపి కల్తీ చేసి టోకు వర్తకులు చిల్లర వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

నరసరావుపేటలోని కొన్ని మిల్లుల్లో నాసిగా, తేమతో ఉన్న వేరుశనగ పప్పు, పత్తిగింజల నుంచి నూనె తీసి టోకు డీలర్లకు విక్రయిస్తున్నారు. ఇది పామాయిల్‌తో పోలిస్తే కిలో రూ. 20 నుంచి రూ. 30 తక్కువకు ఇస్తున్నారు. నరసరావుపేటలో ఓ వ్యాపారి నాణ్యత తక్కువగా ఉన్న నూనె పీపాలు గతంలో నెలకు రూ.100 నుంచి రూ.150 విక్రయించేవారు. ప్రస్తుతం వెయ్యి నుంచి రూ. 1,500 వరకు అమ్ముతున్నారు. ఈ నాసిరకం వేరుశనగ, పత్తిగింజల నూనెలు గుంటూరుకు దిగుమతవుతున్నాయి. వీటిని పామాయిల్‌లో కలిపేస్తున్నారు.

తిను బండారాల వాసన చూడండొకసారి :తినుబండారాల కార్ఖానాలో కళాయి మీద కల్తీ నూనె వేడి చేసి ఆహార పదార్థాలు వేయగానే అది పొంగి కిందకు పోతోంది. సాధారణంగా తినుబండారాలు నెల వరకు నిల్వ ఉంటాయి. కల్తీ వల్ల అవి వారం రోజులకే నూనె వాసన వస్తుండడంతో వెనక్కి ఇచ్చేస్తున్నారని ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. తినుబండారాలు వాసన వస్తున్నాయని మిఠాయి దుకాణాల యజమానులు చెబుతున్నారు. చిల్లరకొట్లు, బజ్జీబండ్లు, అల్పాహారశాలలు, చిప్స్‌ తయారు చేసేవారిలో అత్యధిక శాతం మంది ఈ నూనె వాడుతున్నారు.

బీ అలెర్ట్​ - అల్లం వెల్లుల్లి పేస్ట్​ బయట కొంటున్నారా?

కల్తీ జరుగుతోందిలా :కృష్ణపట్నం పోర్టు నుంచి గుంటూరుకు నేరుగా పామాయిల్‌ వస్తుంది. లారీ రాగానే నూనెను దుకాణంలోని ట్యాంకులోకి పంపింగ్‌ చేస్తారు. నరసరావుపేట నుంచి రప్పించిన నాసిరకం నూనెలు అందులో కలిపేస్తారు. ఈ కల్తీని ట్యాంకు నుంచి నేరుగా రిటైల్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. 16 టన్నుల పామాయిల్‌ వస్తే సుమారు 3 టన్నుల నాసిరకం నూనెలు కలుపుతున్నట్టు సమాచారం. కల్తీ అయ్యాక 15 కిలోల డబ్బాల్లోకి నింపి విక్రయిస్తున్నారు.

అదేవిధంగా పిడుగురాళ్ల, తెనాలి, సత్తెనపల్లి, చిలకలూరిపేట తదితర పట్టణాల్లోనూ ఈ దందా సాగుతోంది. కిలోకు రూ. 20 చొప్పున లెక్కించినా 3 టన్నులకు రూ. 60 వేలు, లాభం కలుపుకుని రోజుకు లారీపై రూ. లక్ష వరకు టోకు వ్యాపారి లబ్ధి పొందుతున్నారు. రోడ్డుపక్కన అల్పాహారశాలలు, చిన్న హోటళ్లు, మాంసాహార విక్రయశాలలవారు ఎక్కువగా కల్తీ నూనె కొనుగోలు చేస్తున్నారు. గుంటూరులోని పట్నం బజారు నుంచి ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు లూజుగా డబ్బాల్లో కొంటున్నారు. గుంటూరులోని ఓ వంట నూనెల వ్యాపారి రోజుకు టోకున 16 టన్నులు, రిటైల్‌లో 16 టన్నుల చొప్పున అంటే 32 టన్నుల వరకు ఈ కల్తీ విక్రయిస్తున్నారు.

కల్తీ నూనెతో క్యాన్సర్​ :కల్తీ నూనెతో వండినవి తింటే వెంటనే కొంతమందికి వాంతులయ్యే అవకాశం ఉంది. మరికొందరికి ఆరు గంటల తరువాత, ఇంకొంతమందికి 24 గంటల తరువాత గొంతునొప్పి వస్తుంది. దగ్గు, కల్లె పడడంతోపాటు ట్రాన్స్‌లైటిస్‌ వచ్చే ప్రమాదం ఉంది. కల్తీ మోతాదు మించితే ఆహారం అరుగుదల సరిగ్గా ఉండదు. కల్తీ నూనెతో చేసినవి నిత్యం తింటుంటే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. దీర్ఘకాలం తింటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. చర్మరోగాలు, అలర్జీలు, దురదలు వస్తాయి. వివిధ రకాల నూనెల్లో సాచ్యురేటెడ్‌ ప్యాటీ యాసిడ్స్‌ వేర్వేరుగా ఉంటాయి. వీటిని మిశ్రమం చేసి వాడకూడదు. దీనివల్ల మెదడు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్‌ సుధీర్​ తెలుపుతున్నారు.​

వంటనూనె కల్తీ జరిగితే అనారోగ్యకరమైన కొవ్వులు, ట్రాన్స్‌ప్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయని వీటివల్ల గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు, చక్కెరవ్యాధి, ఊబకాయం వస్తాయని డాక్టర్‌ అనూష వివరిస్తున్నారు. అంతే కాకుండా కాలేయం దెబ్బతింటుందని, కల్తీ నూనెలతో తయారు చేసిన వేపుళ్లు ఎక్కువగా తింటే క్యాన్సర్‌ వస్తుందంటున్నారు. ఈ నూనెలో క్యాన్సర్‌ కారకాలు ఎక్కువగా ఉంటాయని దీన్ని దీర్ఘకాలం వాడితే అరుగుదల లేకపోవడంతోపాటు మూత్రపిండాలు దెనే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు.

వంటింట్లో మంటలు - నూనె ధరల పెంపుతో సామాన్యులపై భారం వేసిన కేంద్రం - Increased cooking oil prices

ABOUT THE AUTHOR

...view details