Vote Counting Process Start Next Few Hours: ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. కౌంటింగ్‌కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ క్షణాల కోసం అభ్యర్థులతోపాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగ కన్నేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత పెడితే మరికొన్ని చోట్ల ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావులేకుండా గట్టి చర్యలు చేపట్టారు. విజయవాడలో ఓట్ల లెక్కింపు జరిగే నిమ్రా, నోవా కళాశాలల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లోకి అభ్యర్థులు, వారి అధీకృత లెక్కింపు ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. అసాంఘిక శక్తులు ప్రవేశిస్తే వారిని గుర్తించేందుకు వీలుగా సీసీటీవీ కెమెరాలతోపాటు ఫేషియల్ రికగ్నేషన్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా చర్యలు:ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల కోసం 3 వేల మంది విధుల్లో ఉండనున్నారు. 4,5 తేదీల్లో విజయోత్సవాలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్, సెక్షన్ 30 అమలులో ఉంటాయని విజయవాడ సీపీ రామకృష్ణ వెల్లడించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మూడంచెల భద్రత మధ్య విజయవాడ పార్లమెంటు పరిధిలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చెప్పారు. సిబ్బంది నియామకం, ర్యాండమైజేషన్ పూర్తి చేశామన్నారు.
విశాఖలోనూ కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంది. బందోబస్తు కోసం 232 మంది పోలీసులను నియమించారు. 139 పికెట్ పాయింట్స్, 79 పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉంచారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనుమతించబోమని విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజున మద్దిలపాలెం కూడలి ఆర్చ్ నుంచి మూడోవ పట్టణ పోలీస్ కూడలి రోడ్డు వరకు రాకపోకలు నిలిపేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.