Volunteers Participate YCP Election Campaign Authorities Dismissed:ఎన్నికల సంఘం ఆదేశాల్ని వాలంటీర్లు ఖాతరు చేయడం లేదు. వైసీపీ నేతలకు అనుకూలంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తూ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. ఈసీ నిబంధనలు అతిక్రమించిన 30 మంది వాలంటీర్లపై అధికారులు కొరడా ఝుళిపించారు. అయినా స్థానిక నేతల ఒత్తిడితో కొందరు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా తీసుకుంటూ వైసీపీకి ఊడిగం చేస్తున్న 30 మంది వాలంటీర్లపై వేటు పడింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉన్నత అధికారులు 30 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్‌ను విడిచి వెళ్లకూడదని ఆదేశాలు ఇచ్చారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో వైసీపీ శ్రేణులు నిర్వహించిన సిద్ధం గ్రామ స్థాయి సభలో మేమూ సిద్ధమే అంటూ పాల్గొన్న 16 మంది గ్రామ వాలంటీర్లను అక్కడి అధికారులు డిస్మిస్ చేశారు. ఇరుసుమండ, మొసపల్లి గ్రామాలకు చెందిన 16 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.
ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు- వైసీపీ నేతలకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు
వాలంటీర్లపై వేటు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వేముగోడులో వైసీపీ నిర్వహించిన మేము సిద్ధం మా బూత్ సిద్ధంలో పాల్గొన్న ఏడుగురు వాలంటీర్లపై స్థానికులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాలంటీర్లు బాలకృష్ణారెడ్డి, బాకర్‌బీ, అపర్ణ, కామాక్షి, పుష్పవతి, లక్ష్మన్న, మద్దిలేటిని అధికారులు విధుల నుంచి తప్పించారు. ఎమ్మిగనూరు 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక తరఫున ప్రచారం చేసిన నరసింహులును విధుల నుంచి అధికారులు తొలగించారు. కర్నూలు 127వ వార్డుకు చెందిన వాలంటీరు మనోజ్‌కుమార్ కొత్తపేటలో వైసీపీ తరపున ప్రచారం చేయగా విధుల నుంచి తొలగించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ముగ్గురు వార్డు వాలంటీర్లు, ఓ వీఆర్వోపై వేటు వేశారు. వారిపై కేసు నమోదు చేయాలని ఆర్డీవో ఆదేశాలిచ్చారు. చేజర్ల మండలం పాడేరులో మేకపాటి విక్రం రెడ్డి నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు, పవన్, వంశీ, వీఆర్వో ప్రసాద్‌పై అదికారులు వేటు వేశారు. సంగం ఎంపీడీవో కార్యాలయంలో రాజకీనాయకులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్న వాలంటీర్ ప్రసాద్ ముదిరాజ్‌పై కేసు నమోదు చేయాలని ఆర్డీవో ఆదేశించారు.
ఎన్నికల్లో లబ్దిపొందేందుకు వైసీపీ సరికొత్త ఎత్తుగడ- వాలంటీర్లకు నగదు పురస్కారం పెంపు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని మెళియాపుట్టిలో వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తనయుడు ఓంశ్రీకృష్ణ చేపట్టిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీరు ఎం.మణికంఠను విధుల నుంచి దూరం పెట్టారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటకు చెందిన వాలంటీర్లు విజయలక్ష్మి, దుర్గాభవానీని విధుల నుంచి తప్పించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాకలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీరు మురళిని విధుల నుంచి తీసేశారు. చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మి ప్రచారంలో వాలంటీరు రఫీ పాల్గొన్నారు. ఈ విష.యంపై జనసేన నేత శోభన్‌బాబు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.