Volunteers Filed Police Case against YCP Leaders : ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ నాయకుల ఒత్తిడి వల్ల బలవంతంగా రాజీనామాలు చేసినట్లు వాలంటీర్లు వాపోతున్నారు. రాజకీయ ఒత్తిడితో రాజీనామాలు చేయించిన వైఎస్సార్సీపీ నాయకులపై న్యాయస్థానం ఆదేశాలతో వాలంటీర్లు కేసులు పెడుతున్నారు. నెల్లూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లలో వాలంటీర్ల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో మొదటిసారిగా నెల్లూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. న్యాయస్థానం అనుమతులతోనే వాలంటీర్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. గత నాలుగు రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాలంటీర్లు బయటికి వచ్చి వైఎస్సార్సీపీ నాయకుల ఒత్తిడి వల్లే రాజీనామాలు చేసామని చెబుతున్నారు. ప్రతి రోజు పదిమందికిపైగా జిల్లాలో పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు.
ఎన్నికల అనంతరం మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే వస్తుందంటూ వైఎస్సార్సీపీ నాయకులు వాలంటీర్లను ప్రలోభపెట్టారు. ఎన్నికల సమయంలో ఒత్తిడి చేసి వందల మంది వాలంటీర్ల చేత రాజీనామా చేయించారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనేలా చేశారు. తీరా కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారంలోకి రావడంతో వైఎస్సార్సీపీ నాయకుల బెదిరింపుల గుట్టు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు వేధింపులకు గురిచేసి రాజీనామాలు చేయించారని వాలంటీర్లు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల మాటలు వినకుంటే మళ్లీ వాలంటీర్ల ఉద్యోగాలు రావనే భయంతో అనేక మంది రాజీనామాలు చేశారని తెలిపారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండతో వాలంటీర్లు బయటకు వచ్చి వారి సమస్యాను తెలుపుతున్నారు. నగరంలోని చిన్నబజారు పోలీస్ స్టేషన్, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లలో కుప్పలుగా ఫిర్యాదులు చేస్తున్నారు.