ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయ్యయ్యో ప్రారంభించిన మరునాడే తెగి - 300 మీ. కొట్టుకుపోయిన ఫ్లోటింగ్​ బ్రిడ్జి

Visakha Floating Bridge: విశాఖ బీచ్ రోడ్డులో ఆదివారం ప్రారంభించిన నీటిపై తేలే వంతెన, మరుసటి రోజే తెగిపోయింది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇలా తెగిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కానీ, అధికారులు మాత్రం ట్రయల్​ రన్​ అని, సాంకేతిక పరిశీలన అంటూ వివరణలు ఇస్తున్నారు.

visakha_floating_bridge
visakha_floating_bridge

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 7:08 AM IST

అయ్యయ్యో ప్రారంభించిన మరునాడే తెగి - 300 మీ. కొట్టుకుపోయిన విశాఖ బీచ్‌లోని ఫ్లోటింగ్ బ్రిడ్జి

Visakha Floating Bridge: అట్టహాసంగా విశాఖ బీచ్‌లో ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి ఒక్క రోజులోనే తెగిపోయింది. బీచ్‌కు వచ్చే సందర్శకులు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన తేలియాడే వంతెనను వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ నేతలు ఆదివారమే ప్రారంభించారు. సోమవారం నుంచి సందర్శకులను అనుమతించాలని భావించగా అంతలోనే అది కాస్తా రెండు ముక్కలై సంద్రంలో తేలియాడింది. ఆ సమయంలో పర్యాటకులను ఇంకా అనుమతించకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

సముద్ర తీరం నుంచి లోపలికి వంద మీటర్ల పొడవున ఫ్లోటింగ్ డబ్బాలతో ఈ వంతెనను ప్రైవేటు వ్యక్తులతో విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ- వీఎమ్​ఆర్​డీఏ ఏర్పాటు చేయించింది. 'టీ' ఆకారంలో ఉన్న దాని మీద నడుచుకుంటూ వెళ్లి చివరన నిల బడి సముద్రాన్ని వీక్షించొచ్చు. ఆ వీక్షించే భాగమే తెగిపోయింది. అనుసంధానంగా ఉన్న ప్రాంతం నుంచి అది తెగిపడి సుమారు మూడు వందల మీటర్ల దూరంలోకి వెళ్లిపోయింది. అలల తీవ్రతకు అనుసంధాన బోల్టులు విరిగిపోయాయి.

లిక్విడ్​లో ముంచితే ఒరిజినల్​ - రూ.30 లక్షలకు మూడు కోట్లు - ఇద్దరు అరెస్ట్​

నిర్మాణానికి కోటిన్నర వ్యయం: వైఎస్సార్​సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆదివారం దీన్ని ప్రారంభించారు. సోమవారం నుంచి సందర్శకులు దీనిపై వెళ్లే అవకాశం కల్పించారు. అయితే ప్రారంభించి 24 గంటలు గడవక ముందే ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ తెగిపోయింది. అలలపై నడిచి వేళ్లే ఈ వంతెన కోసం కోటి 60 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.

సందర్శకుల అనుమతికి ముందే సంద్రంలో : నిర్వాహకులు మూడేళ్ల పాటు ఏటా 15 లక్షల రూపాయలు వీఎమ్​ఆర్​డీఏకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. దీనిపై వెళ్లేందుకు పెద్దలకు వంద, పిల్లలకు 70 రూపాయలు టికెట్‌ ఖరారు చేశారు. సందర్శకులను అనుమతించకముందే ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ తెగిపోయింది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై పర్యాటకులు ఉంటే పెను విషాదమే జరిగి ఉండేది.

టీడీపీ-జనసేన కూటమిని గెలిపించండి - అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం: లోకేశ్

ఘటనపై వివరణలు ఇస్తున్నా అధికారులు :అధికారులు మాత్రం ట్రయల్ రన్ అని, సాంకేతిక పరిశీలనలో భాగంగా దానిని వేరుచేశామని చెబుతున్నారు. వాస్తవానికి విరిగిన బోల్టులు చూస్తే తెగిపడినట్లే స్పష్టమవుతోంది.

అలల తీవ్రతకు ఎగిరి : ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం, ఏర్పాటుపై నిపుణులు మొదటి నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తునే ఉన్నారు. పర్యాటకుల ఆహ్లాదం కోసం ప్రభుత్వం ఈ రకమైన వంతెనలు ఏర్పాటు చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు. ఇవేవి పట్టించుకోకుండా వైఎస్సార్​సీపీ ప్రభుత్వం 'కురుసురా జలాంతర్గామి'కి సమీపంలో దీన్ని నిర్మించారు. సోమవారం అలల తీవ్రతకు వంతెన నాలుగు అడుగులు పైకి ఎగిరి రెండు ముక్కలైంది.

ఫ్యాన్‌ను చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం వచ్చింది: నారా లోకేశ్

కూలుతున్న నిర్మాణాలు వైఎస్సార్​సీపీ పనితీరుకు దర్పణం :విశాఖలో పనుల మధ్యలోనే కూలిపోతున్న నిర్మాణాలు వైఎస్సార్​సీపీ ప్రభుత్వ పని తీరుకు దర్పణం పడుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. గతంలో జీవీఎంసీ నూతన బస్‌ బేల నిర్మాణం చేసింది. ద్వారకా బస్ స్టేషన్‌కు సమీపంలో బస్ బే పనులు పూర్తికాకముందే కూలిపోయింది. ఆ సమయంలోనూ ప్రయాణికులు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది.

'జి-20' సన్నాహక సదస్సు సమయంలో బీచ్‌లో చేపట్టిన సుందరీకరణ పనులు కూడా కొద్ది రోజులకే ధ్వంసం అయ్యాయి. తాజాగా ఫ్లోటింగ్ బ్రిడ్జి కూడా ప్రారంభించిన మరుసటి రోజే తెగిపోవడంపై నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి కనీస భద్రత లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శిస్తున్నారు.

పెద్దజాలరిపేటలో రింగ్‌ వలల వివాదం- అప్రమత్తమైన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details