Visakha Dairy Chairman Adari Anand Kumar joins BJP:విశాఖ డెయిరీ ఛైర్మెన్ ఆడారి ఆనంద్ కుమార్,అతని సోదరి యలమంచిలి మున్సిపల్ ఛైర్పర్సన్ పిల్లా రమాకుమారి బీజేపీలో చేరారు. రాజమహేంద్రవరంలో జీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్వరి సమక్షంలో వారు పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు, మంత్రి అమిత్షా ఆశీస్సులతో బీజేపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. ఆడారి ఆనంద్ కుమార్ చేరికతో విశాఖ ప్రాంతంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఎంపీ పురందేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారని పురందేశ్వరి చెప్పారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తుందని, డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఇది సాధ్యమవుతోందని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు.
కొన్ని రోజుల క్రితం విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, డెయిరీ డైరెక్టర్లు వైఎస్సార్సిపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు లేఖ రాసి పంపారు. గత కొన్ని నెలల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో వీరు టీడీపీలో గాని లేదా బీజేపీ లో గాని చేరతారని జోరుగా ప్రచారం సాగింది. ఈ పరిణామంలో ఈరోజు రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి సమక్షంలో పార్టీలో చేరడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.