AP Rains Latest Update :వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్టణం, కాకినాడ తీరాల్లో పెద్ద ఎత్తున సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. అలాగే రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు, ఉమ్మడి నెల్లూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో కొన్ని చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ వద్ద అలలు దుకాణాలను తాకుతున్నాయంటే వాయుగుండం ఎఫెక్ట్ ఎంత భీకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షానికి విశాఖ జిల్లాలోని పెదగంట్యాడ మండలం కొంగపాలెంలో రేకుల షెడ్డు కూలిపోయి ఓ వ్యక్తికి గాయాలు అయ్యాయి.
కాకినాడ తీరం అల్లకల్లోలం :కాకినాడలోని ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక్కడ అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, ఇళ్లు, చెట్లు నేల కూలాయి. అలాగే అంతర్వేది తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. గోదావరి సంగమం వద్ద అలలు ఉద్ధృతంగా ఉన్నాయి. పల్లిపాలెంలో బీచ్ రోడ్డు, ఇళ్లును అలలు ముంచెత్తాయి. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడగా, ఓఎన్జీసీ ప్లాంటును సముద్రపు నీరు తాకింది. ఆక్వా చెరువుల్లో సముద్రం నీరు ముంచెత్తింది.
తిరుపతి జిల్లా తడ వద్ద తీరం దాటిన వాయుగుండం : వాయుగుండం తిరుపతి జిల్లా తడ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 22 కిలోమీటర్ల వేగంతో కదిలి గడిచిన ఆరు గంటల్లో తీరాన్ని తాకినట్లు వెల్లడించింది. అనంతరం వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.