Viral Fevers Spreading In Karimnagar :ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు వణికిస్తున్నాయి. వర్షాకాలం కావడం, ఇళ్ల మధ్య మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి జ్వరాలు ప్రబలుతున్నాయి. గత రెండు నెలలుగా జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. గత నెలతో పోలిస్తే సర్కార్ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆగస్టులో రోజుకు 500 నుంచి 600 వరకు రోగులు జ్వరాలతో వస్తే, ఇప్పుడు ఆ సంఖ్య 1000 నుంచి 1300లకు పెరిగింది.
ఉమ్మడి జిల్లాలోని గ్రామీణం, ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్ని కుటుంబాల్లో ఇద్దరి కంటే ఎక్కువ మందే జ్వరాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు సరిపోక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు ఆస్పత్రులపై నమ్మకం లేక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల బాట పడుతున్నారు. సర్కారు ఆసుపత్రిలో శుభ్రత లేదని రోగులు వాపోతున్నారు. వైద్యులు రాసే మందుల్లో కొన్ని మాత్రమే అక్కడ లభిస్తుంటే, మిగిలిన వాటిని వేరే చోట కొనాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జ్వరానికి తెలియదే అక్కడ బెడ్లు లేవని - 30 పడకల ఆస్పత్రికి 400 మంది రోగులు - SULTANABAD HOSPITAL ISSUE
"ఆసుపత్రికి వస్తున్నాం, చికిత్స చేస్తున్నారు. మందుల చిట్టి రాస్తున్నారు. అందులో ఒకటి, రెండు ఇక్కడ దొరుకుతున్నాయి. మిగితావి బయటకు రాస్తున్నారు. డబ్బులు లేకనే కదా మేము ప్రభుత్వాసుప్రత్రికి వస్తాము. నర్సులు కూడా పట్టించుకోవడం లేదు. ఇలా చేస్తే మేం ఎటు పోవాలి. ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలి." - బాధితులు
ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా వస్తున్న జ్వరాలను డెంగీ జ్వరంగా భావించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానాలు ఉంటే ప్రైవేట్ ఆసుపత్రికి కాకుండా ప్రభుత్వాసుపత్రికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
"గత మూడు రోజులుగా వర్షాలు కురవడం వల్ల వైరల్ ఫీవర్స్ కేసులు బాగా పెరిగిపోయాయి. ఎమర్జెన్సీ కేసులు కూడా భారీగా వస్తున్నాయి. వచ్చిన కేసుల్లో చాలా వరకు ఫీవర్ కేసులు ఉంటున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానికి తగ్గ సదుపాయాలు కల్పిస్తున్నాము. నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే దోమలు రాకుండా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి." - డా.నవీన, కరీంనగర్, ఆర్‌ఎంవో
తక్షణ అవసరాల కోసం కొన్ని మందులను కొనుగోలు చేస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. జ్వరం బారిన పడిన తర్వాత భయాందోళనకు గురయ్యే కంటే, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఇబ్బందులు ఉండవని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు.
'పడకేసిన పల్లె వైద్యం - సీజనల్ వ్యాధులతో జనం విలవిల' - ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్ - Harish Rao Tweet On Viral Fevers
తెలంగాణలో వైరల్ ఫీవర్స్ - మీకు ఈ లక్షణాలున్నాయా? - ఐతే హస్పిటల్ వెళ్లాల్సిందే! - Viral Fevers In Telangana