Viral Fever Cases Increasing Day by Day In AP : రాష్ట్రంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికులు జ్వరాల బారిన పడుతున్నారు. రోజురోజుకూ రాష్ట్రంలో వైరల్ జ్వరాల కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. మలేరియా, డెంగీ కేసులు అనధికారికంగా మరింత ఎక్కువగా ఉంటున్నాయి. 104 డిగ్రీల జ్వరంతో బాధపడేవారు సైతం గతేడాది కనిపించారు. ఈసారి శరీర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ విపరీతమైన నీరసం బాధితులను ఇబ్బంది పెడుతోంది.
104 డిగ్రీల జ్వరంతో ఆసుపత్రులకు : వైరల్ జ్వరాలు ప్రస్తుతం రాష్ట్రాన్ని భయపెడుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల దాకా జ్వరంతో వణికిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జ్వర పీడితులు చికిత్స కోసం క్యూ కడుతున్నారు. 104 డిగ్రీల జ్వరంతో ఆసుపత్రులకు వస్తున్నారు. డెంగీ, మలేరియా జ్వరాలు కొందరికి వస్తున్నాయి. వీటితో పాటు టైఫస్,టైఫాయిడ్లు కూడా మరి కొందరికి వస్తున్నాయి. దీంతో రోజురోజుకూ జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. గత రెండు వారాల నుంచి ఒక్కసారిగా జ్వర పీడితులు పెరుగుతున్నారు.
సీజనల్ వ్యాధుల పటిష్ట నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలి : మంత్రి సత్యకుమార్ - Minister Review
స్వైరవిహారం చేస్తున్న జ్వరాలు : విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతిసహా అన్ని ప్రాంతాల్లోని ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. పిల్లల్లో ఎడినో, ఇన్‌ఫ్లూయెంజా వైరస్ జ్వరాలను వైద్యులు ఎక్కువగా గుర్తిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలూ కనిపిస్తున్నాయి. వర్షాకాలానికి తోడు పారిశుద్ధ్య లోపం వల్ల నగరాలు, పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. నీరు, గాలి కాలుష్యంతోడై జ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి.
"గత రెండు వారాల నుంచి డెంగ్యూ జ్వరాలు పిల్లల్లో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో చిన్నారులు ఎక్కువగా కనిపిస్తున్నారు. చిన్నారుల ఆసుపత్రుల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం కేసులు అధికంగా నమోదవుతున్నా ప్రాణాపాయం ఎవరికీ లేదు. మలేరియా,టైఫాయిడ్ రక్తపరీక్షల్లో నెగిటివ్ అని వచ్చినా వైరల్ జ్వరాల లక్షణాలు ఉంటున్నాయి." - డా.పివి రామారావు, పిల్లల వైద్య నిపుణులు
ఆసుపత్రుల్లో మంచాలు ఫుల్ : కృష్ణాజిల్లాలో మొవ్వ, అవనిగడ్డ, ఉయ్యూరు ఆసుపత్రుల్లో మంచాలు జ్వర బాధితులతో నిండుతున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, కుక్కునూరు మండలాల్లో జ్వరపీడితులు ఎక్కువగా ఉన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గాల పరిధిలోనూ విషజ్వరాల బెడద ఎక్కువగా ఉంది. పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో రోజూ 550 వరకు ఓపీ నమోదవుతోంది. ఇందులో వంద మంది వరకు జ్వరపీడితులు ఉంటున్నారు.
చికిత్స కోసం జ్వర పీడితులు క్యూ :కృష్ణాజిల్లా మొవ్వ, అవనిగడ్డ పీహెచ్సీ జ్వర బాధితులతో నిండిపోయింది. వైద్యులు ముందస్తు జాగ్రత్తగా ఔషదాలు అందుబాటులో ఉంచుతున్నారు. జ్వరం తీవ్రత అధికంగా ఉంటే వెంటనే ఆసుపత్రికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం, నందిగామ, తిరువూరుల్లో జ్వరాల తీవత్ర అధికంగా ఉంది. వైద్యచికిత్స కోసం జ్వర పీడితులు క్యూ కడుతున్నారు.
"మలేరియా జ్వరం వచ్చినప్పటి నుంచి వాంతులు, విరేచనాలు, తీవ్రమైన తలనొప్పి, కండరాలు కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. కూర్చుంటే లేవటానికే కష్టమవుతుంది. మా ఊరిలో ఉన్న డాక్టర్లకు చూపించిన తగ్గలేదు. అందుకే పెద్దసుపత్రికి వచ్చాం. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. వైద్యులు సకాలంలో స్పందించి చికిత్స అందిస్తున్నారు. అందుకే త్వరగా కోలుకున్నాం." - రోగులు
ఆ జిల్లాల్లో ఎక్కువ కేసులు : ప్రస్తుతం డెంగీ, మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నప్పటికీ రెండేళ్లతో పోల్చితే మలేరియా, గన్యా కేసులు పెరగ్గా డెంగీ కేసులు తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు 4,610 మలేరియా కేసులు నమోదయ్యాయి. గిరిజన ఆవాస ప్రాంతాలున్న జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట ఆసుపత్రి పరిధిలోని గ్రామాల్లో, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని గ్రామాల్లో జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నారు. కొత్తూరులోని సామాజిక ఆసుపత్రిలో ప్రతిరోజు 150 వరకు ఓపీ నమోదవుతోంది. ఇందులో జ్వరాల కేసులే ఎక్కువగా ఉంటున్నాయి.
డెంగీ, మలేరియా లక్షణాలు : మన్యం జిల్లాలో జ్వరాల బెడద మరీ ఎక్కువగా ఉంది. జియ్యమ్మవలస మండలం చిత్రపాడు పంచాయతీ పరిధిలో తీవ్ర జ్వరంతో ఉదయం తల్లి, సాయంత్రం కుమార్తె ఇటీవల మరణించారు. రెండేళ్లతో పోల్చితే గన్యా కేసులు రాష్ట్రంలో పెరిగాయి. సమాచార విస్తృతి అందుబాటులోకి వచ్చినందున కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గడిచిన రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది డెంగీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 2,955 కేసులు రికార్డయ్యాయి. వాంతులు, విరేచనాలు, తీవ్రమైన తలనొప్పి, కండరాలు కీళ్ల నొప్పులు, ఆకలి మందగించడం వంటి లక్షణాలు డెంగీ, మలేరియా జ్వరాల బారినపడిన వారిలో కనిపిస్తున్నాయి.
జలుబా? ఫ్లూ జ్వరమా? : సాధారణ జలుబు లక్షణాలు, ఫ్లూజ్వర లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. దీంతో వచ్చింది జలుబా? ఫ్లూ జ్వరమా? అన్నది తేలడం లేదు. జలుబు కారణంగా తీవ్రమైన జ్వరం అరుదుగా వస్తుంది. ఫ్లూ లక్షణాలు కాస్త తీవ్రంగా ఉంటాయి. పొడి దగ్గు, గొంతు నొప్పితోపాటు జ్వరం 101 డిగ్రీలకంటే ఎక్కువగా ఉంటుంది. వీటికితోడు ఒళ్లనొప్పులు, తలనొప్పి, బడలిక వంటివీ ఎక్కువగా ఉంటున్నాయి. లేవటానికే కష్టమవుతుంది. మలేరియా కేసులు అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2,378, మన్యం 1,246, విజయనగరం జిల్లాలో 504 చొప్పున నమోదయ్యాయి. డెంగీ కేసులు విశాఖపట్నం జిల్లాలో 353, తిరుపతి 240, కర్నూలు జిల్లాలో 211 చొప్పున రికార్డయ్యాయి. గన్యా జ్వరాలు తిరుపతి జిల్లాలో 47, చిత్తూరు 19, ఏలూరు జిల్లాలో 15 చొప్పున గుర్తించారు.
"వ్యక్తిగత శుభ్రత తప్పనిసరి. అనర్హుల వద్ద వైద్యం ప్రాణాంతకం. వారు ఎక్కువగా యాంటీబయాటిక్స్ ఇస్తూ రోగులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తారు. అర్హులైన వైద్యులు రోగి శరీర బరువు, ఇతర లక్షణాలనుబట్టి చికిత్సనందిస్తారు. సీజనల్ వ్యాధుల్లో డయేరియా ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా 56 చోట్ల అధికంగా అతిసారం కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరినుంచి ఇటీవలి వరకు రెండువేల మందికిపైగా అతిసారం బారిన పడ్డారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు."- వైద్యులు
వర్షాలతో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు - అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు - Viral Fever Cases Rising In AP
అన్ని అవయవాలపై ప్రభావం - మాయదారి జ్వరంతో జనం బెంబేలు - Viral Fevers Spreading in AP