Violent Incidents With Division of Police Units :పార్లమెంటు నియోజకవర్గాల పరిధి ప్రకారం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లాను రెండుగా విభజించింది. విజయవాడ నగరానికి సమీపాన ఉండే పెనమలూరు, గన్నవరం సర్కిళ్లను కృష్ణా పోలీసు విభాగంలో విలీనం చేసింది. అసంబద్ధ విభజన ఫలితంగా ఎన్నికల రోజు గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి.
నియంత్రించని పోలీసులు : 2019 ఎన్నికల్లో గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు లేవు. సమయం మించిపోయినా ఓటింగ్‌కు అనుమతించడంపై ప్రసాదంపాడులోని ఓ బూత్‌లో వివాదం తలెత్తినా ఘర్షణ మాత్రం జరగలేదు. కానీ 2024 ఎన్నికల్లో గన్నవరంలో పెద్దఎత్తున గొడవలు, దాడులు జరిగాయి. 13వ తేదీన పోలింగ్ మొదలవగానే తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, వైఎస్సార్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ బూత్‌ల పరిశీలనకు బయలుదేరారు. ఇద్దరూ దాదాపు ఒకే మార్గంలో ఒకేచోటుకు వెళుతున్నట్లు తెలిసినా పోలీసులు నియంత్రించలేదు. నున్న ప్రాంతంలో మొదలైన కవ్వింపులు తారస్థాయికు చేరి, సూరంపల్లిలో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత యార్లగడ్డ వాహనశ్రేణిని అనుసరిస్తూ వంశీ రావడం, ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద యార్లగడ్డ వాహనాలపై వంశీ అనుచరులు రాళ్ల దాడికి దిగడం చకచకా జరిగిపోయాయి.
పల్నాడు గొడవల్లో కోవర్ట్ ఆపరేషన్? - ఇంటిదొంగలపై పోలీస్‌శాఖ విచారణ - POLICE HELP IN PALNADU VIOLENCE
సమస్యాత్మక నియోజకవర్గంగా గుర్తించినా సరిపడా పోలీసు బలగాలను కేటాయించలేదు. జిల్లా కేంద్రం 60 కిలోమీటర్ల దూరాన ఉండటంతో అక్కడి నుంచి సిబ్బంది వచ్చేవరకు ఇక్కడున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు దౌర్జనాలకు దిగారు. గతేడాది ఫిబ్రవరిలో తెలుగుదేశం కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలోనూ మచిలీపట్నం నుంచి అదనపు బలగాలు రావడానికి చాలా సమయం పట్టింది.
గంజాయి బ్యాచ్ అరాచకాలు :ఎన్నికల వేళ పెనమలూరు నియోజకవర్గంలోనూ ఘర్షణలు తలెత్తాయి. పోరంకిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగి రమేష్ అనుచరులు రాళ్ల వర్షం కురిపించారు. అలాగే కర్రలు పట్టుకుని వీరంగం చేశారు. ఇంత జరిగినా అక్కడున్న పోలీసులు సమర్థంగా నియంత్రించలేకపోయారు. దూరాన ఉన్న జిల్లా కేంద్రం నుంచి ఎస్పీ, అదనపు సిబ్బంది వచ్చే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంతా అయిపోయాక వచ్చిన పోలీసులు హడావుడి చేయడం తప్ప ఒరిగింది శూన్యం.