Vijayawada West Bypass Phase-3 Works To Be Complete Shortly : విజయవాడ నగరవాసుల దశాబ్దాల కల సాకారం కాబోతోంది. ట్రాఫిక్ వల్ల వాహనదారులు ఎన్నో ఏళ్లుగా పడుతున్న నరకయాతన నుంచి త్వరలోనే విముక్తి లభించనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విజయవాడ పశ్చిమ బైపాస్ దాదాపు పూర్తి కావొచ్చింది. అధునాతన బైపాస్ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి సర్కార్ శరవేగంగా చర్యలు తీసుకుంటోంది.
విజయవాడ పశ్చిమ బైపాస్ : విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే వారికి త్వరలోనే ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభించనుంది. అమరావతిని దేశంలోని పలు ప్రాంతాలకు అనుసంధానించడం కోసం 2014లో అప్పటి టీడీపీ సర్కార్ గన్నవరం దగ్గరలోని చిన్నఅవుటపల్లి నుంచి మంగళగిరి సమీపంలోని కాజా టోల్‌గేట్ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించింది. 47.8 కిలోమీటర్ల దూరం గల ఈ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చేసింది. ఆరు వరసల రహదారి కోసం టీడీపీ సర్కార్ డీపీఆర్ రూపొందించి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో ఆమోదింపజేసింది.
95 శాతం పనులు పూర్తి : ఈ బైపాస్‌ను కేంద్రం భారత్ మాల ప్రాజెక్టు కింద చేర్చి NHAIకి రోడ్డు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. రెండు ప్యాకేజీలుగా విభజించి NHAI ప్రఖ్యాత నిర్మాణ సంస్థలకు పనులు అప్పజెప్పింది. చిన్నఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల బైపాస్‌ను ప్యాకేజీ-3గా చేసి నిర్మాణ బాధ్యత మేఘా ఇంజినీరింగ్‌కు కట్టబెట్టింది. గొల్లపూడి నుంచి కాజా టోల్‌గేట్ వరకు మరో 17.8 కిలోమీటర్ల మార్గాన్ని ప్యాకేజీ-4 గా నిర్ణయించి నవయుగ, అదానీ గ్రూప్‌లకు అప్పగించింది. 2021లో పనులు చేపట్టిన నిర్మాణ సంస్థలు శరవేగంగా జరిపాయి. చిన్నఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల మార్గం 95 శాతం పూర్తిచేసింది.