Vijayawada Flower Market: విజయవాడలోని ఈ పూల మార్కెట్లో దొరకని పువ్వంటూ ఉండదు. వేడుక ఏదైనా పూల కొనుగోలుదారులు ఈ మార్కెట్‌కి రావాల్సిందే. పండగలు, ఉత్సవాలు అయితే వేలాది రూపాయల పూలు ఈ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఈ మార్కెట్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలకు పూలు ఎగుమతి చేస్తుంటారు. ఈ మార్కెట్‌కి పూలు బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుంటారు. ఉత్సవాల సమయంలోనే కాదు సాధారణ రోజుల్లో సైతం వేలాది మంది వచ్చి వారికి కావాల్సిన పూలను కొనుగోలు చేసుకుని తీసుకెళ్తారు. విజయదశమి కావడంతో ఈ పూల మార్కెట్ కొలుగోలుదారులతో కళకళలాడుతోంది.
విజయవాడలో వీఎంసీ కార్యాలయం పక్కనే ఉన్న పూల మార్కెట్ కొనుగోలుదారులతో కళకళ లాడుతోంది. ఈ పూల మార్కెట్లో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల పూలు దొరకడంతో నిత్యం వేలాది మంది వచ్చి వారికి కావాల్సిన పూలు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఇటీవల నగరంలో కురిసిన వర్షాలు, బుడమేరు వరదల కారణంగా ప్రజలు వినాయక చవితి గొప్పగా జరుపుకోలేకపోయారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు మునిగి తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రస్తుతం వరద ప్రభావం తగ్గి పూర్తి స్థాయిలో తేరుకున్నారు.
దీంతో ఈ దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. పూల మార్కెట్లో ప్రస్తుతం పండగల సీజన్ కావడంతో పూల ధరలు అధికంగా ఉన్నాయి. మల్లెపువ్వులు 16 వందల రూపాయలకు అమ్ముతున్నారు. మిగతా పువ్వులన్నీ వంద రూపాయల నుంచి 5 వందల రూపాయల వరకూ అమ్ముడుపోతున్నాయి. పూల ధరలు అధికంగా ఉండటంతో సామాన్యులు తక్కువ పూలనే కొనుగోలు చేసి వెనుదిరుగుతున్నారు. సాధారణ రోజుల కంటే రెట్టింపు ధరలకు పూలు అమ్ముతున్నట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు.
విజయవాడ పూల మార్కెట్‌కు అధిక శాతం బెంగళూరు నుంచి దిగుమతి అవుతుంటాయి. మల్లెపూలు, సన్నజాజులు వంటివి మైలవరం ప్రాంతం నుంచి విజయవాడ పూల మార్కెట్‌కు వస్తుంటాయి. అయితే ఈ మార్కెట్ నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పూలను ఎగుమతి చేస్తుంటారు. ప్రధానంగా విశాఖపట్నం, తుని, రాజమండ్రి, మచిలీపట్నం, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు పూలు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఈ పూల మార్కెట్లో 81 షాపులు ఉన్నాయి.