Vigilance Report on Medigadda : మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ నిర్మాణం ప్లాన్ ప్రకారం లేదని రాఫ్ట్, సీకెంట్ ఫైల్స్ నిర్మాణం తగిన రీతిలో జరగలేదని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. డ్రాయింగ్ ప్రకారం లేకపోవడమే నష్టానికి ప్రధాన కారణమైందని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 16 నుంచి 21 వరకు పియర్స్‌కు పగుళ్లు, రాఫ్ట్ వైఫల్యాలకు సపోర్టింగ్ మెటీరియల్ కోల్పోవడం కారణం కావచ్చని, ఇందుకు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కారణమని తెలిపింది.
2019 జూన్ 21న బ్యారేజీ ప్రారంభించినప్పటి నుంచీ నిర్వహణ సరిగా లేదని, 2019లోనే సీసీ బ్లాకులు పక్కకెళ్లిపోవడం, ప్లింత్ శ్లాబ్ పారామెట్రిక్ జాయింట్‌ను గుర్తించినా పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రమైందని విజిలెన్స్ తెలిపింది. ఇందుకు నిర్మాణ సంస్థ, నీటి పారుదల శాఖలే కారణమని రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. తమ పరిశీలనలో తేలిన అంశాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాజీవ్‌రతన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడమే కాకుండా, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) పర్యటన సందర్భంగా కూడా పలు వివరాలను వారు తెలిపారు.
మేడిగడ్డ పూర్తయినట్టా కానట్టా - విజిలెన్స్ విచారణలో ఆసక్తికర విషయాలు
Medigadda Barrage Damage Issue Updates : దెబ్బతిన్న వాటిని బాగు చేయాలని పలుమార్లు నీటి పారుదల శాఖ లేఖలు రాసినా, నిర్మాణ సంస్థ పట్టించుకోలేదని విజిలెన్స్ నివేదికలో పేర్కొంది. 2020 మే 18న, 2021 ఫిబ్రవరి 17న, 2022 ఏప్రిల్ 6న, 2023 ఏప్రిల్ 23న లేఖలు రాసినా స్పందనలేదని, కానీ ఒప్పందానికి భిన్నంగా పని పూర్తయినట్లు ఇంజినీర్లు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని స్పష్టం చేసింది. బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాత కూడా కాఫర్ డ్యామ్, షీట్ ఫైల్స్‌ను ఐదు సీజన్ల పాటు తొలగించకపోవడం నది ప్రవాహాన్ని దెబ్బతీసిందని తెలిపింది.