Vigilance Officer Siezed Illegal Cigarettes in Nellore District : నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ అధికారులు అక్రమంగా నిషేధిత సిగరెట్లు విక్రయిస్తున్న ముఠాపై దాడులు నిర్వహించారు. కోవూరు, నెల్లూరులో పెద్దఎత్తున నిల్వ ఉంచిన నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ సిగరెట్ల విలువ 2 కోట్ల 20లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. చేపల రవాణా చేస్తున్న డబ్బాల్లో నకిలీ బ్రాండ్ సిగరెట్లు రవాణా చేస్తున్నారని అధికారులు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా తయారు చేస్తూ విక్రయిస్తున్న సిగరెట్ల గుట్టురట్టైంది. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో భారీగా ఈ సిగిరేట్లు పట్టుబడ్డాయి. నెల్లూరు నగరం, కోవూరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు రెండు కోట్ల 20 లక్షల రూపాయల విలువైన సిగిరేట్లను పట్టుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ రాజేంద్రకుమార్ ఆదేశాలతో నిఘా ఉంచిన అధికారులు, రెండు బృందాలుగా విడిపోయి నెల్లూరు రామలింగాపురం వద్ద ఓ గోదాము, కోవూరులోని ఘటి పార్శల్ సర్వీస్‌లో దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున నకిలీ సిగిరేట్లను స్వాధీనం చేసుకున్నారు.
'ఎటువంటి అనుమతులు లేకుండా తయారు చేసిన సిగరెట్లు అమ్మతూ ప్రభుత్వానికి రావల్సిన టాక్స్‌ను ఎగ్గొడుతూ తీవ్ర నష్టం కలగజేస్తున్నారు. దొంగ చాటుగా సిగరెటుగా వీటిని తయారు చేస్తున్నట్లు కూడా తెలిసింది. వీటి నిర్వాహకుల పైన కఠిన చర్యలు తీసుకుంటాం.' - విష్ణు కుమార్ డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్