Vidadala Rajini Kidnapped: ఒకే పేరు మీద ఉన్న అభ్యర్థులు పోటీ చేస్తుంటే, వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారు. వారిని నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారు. అంతటితో ఆగకుండా వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ, అపరించడానికి సైతం వెనకాడటం లేదు. అందులో భాగంగా నామినేషన్లకు చివరి తేదీన ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. గుంటూరు పశ్చిమ, మంగళగిరి ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని భావించిన, మహిళలను అపహరించిన ఘటనలు సంచలనం రేపుతోన్నాయి.
మంగళ గిరిలో పోటి చేయకుండా: రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున గుంటూరులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్లు వేసేందుకు యత్నించిన ఇద్దరు స్వతంత్ర మహిళా అభ్యర్థులను అధికార పార్టీ నేతలు నిర్బందించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మురుగుడు లావణ్య అనే మహిళ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆమెను గృహనిర్బంధం చేశారు. సమాచారం అందుకున్న టీడీపీ నేతలు మురుగుడు లావణ్య నివాసముంటున్న టిడ్కో నివాసాల వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల నేతలు పెద్ద ఎత్తున టిడ్కో నివాసాల వద్దకు రావడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు వేడెక్కాయి.
టీడీపీ నేతల రాకతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రోడ్డుపై ఉన్న టీడీపీ నేతలను పోలీసులు బలవంతంగా బయటికి పంపించేశారు. అదే సమయంలో వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించారు. మురుగుడు లావణ్య నివాసంలో ఉన్న వైసీపీ నేతలను పోలీసులు బయటకు పంపకపోగా, వారికి కాపలాగా ఉన్నారు. పోటీ చేయవద్దంటూ వైసీపీ నేతలు లావణ్య కుటుంబ సభ్యులతో బేరసారాలకు దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తన వాహనాలను అక్కడికి పంపించారు. లావణ్యతో పాటుగా ఆమె కుటుంబ సభ్యులను వెనక దారి నుంచి కారులో తరలించారు. ఈ తతంగం అంతా పోలీసులు గమనిస్తున్నా, చూసీచూడనట్లు ఉండిపోయారు. పైగా టీడీపీ నేతలు, కార్యకర్తలు అటువైపుగా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ తతంగాన్ని పట్టణ సీఐ శ్రీనివాసరావు దగ్గరుండి పర్యవేక్షించారు.