Threats From Digital Arrest in Vijayawada :'మీ ఆధార్ కార్డు నకిలీది. మీ మీద కేసు నమోదు అయింది. మిమ్మలను అరెస్ట్ చేస్తున్నాం. విజయవాడలోని మొగల్రాజపురానికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (29)ను సుమారు 2 గంటల సేపు మాటల్లో పెట్టారు. రకరకాలుగా బెదిరించారు. అవసరం అయితే మీ ఏరియా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లండంటూ భయపెట్టారు'. నిజంగానే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తించి కాల్ కట్ చేశారు. సోమవారం ఈ ఘటన జరిగింది.
'మీ కుమార్తె లండన్‌లో డాక్టర్ చదువుతోంది. ఆమెపై కేసు నమోదు అయింది. ఆమెను అరెస్టు చేస్తున్నాం' విజయవాడలోని అంటూ కృష్ణలంకకు చెందిన ఓ వ్యాపారి (62)కి ఈ నెల 2న వచ్చిన బెదిరింపు కాల్. సీబీఐ అధికారిని అంటూ వీడియో కాల్ చేసి బెదిరింపులకు దిగారు. రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యాపారి కాల్ కట్ చేశారు. తాజాగా సోమవారం సైబర్ క్రైం పోలీసులుకు సమాచారం అందించారు.
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్ - అలర్ట్ కావడంతో డబ్బు సేఫ్
'మీరు ఇంటర్నెట్లో అసభ్యకరమైన చిత్రాలు చూస్తున్నారు. మీ మీద కేసు నమోదు అయింది. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం' అంటూ ఓ వ్యవసాయశాఖ విశ్రాంత అధికారి (65)కి వచ్చిన ఫోన్ కాల్ ఇది. కంగారు పడిన ఆయన కాల్ కట్ చేశారు. ఈ నెల 6న సైబర్ నేరగాళ్లు ఫోన్ చేయగా ఆయన సైబర్ క్రైం పోలీసులకు సోమవారం వచ్చి జరిగిన సంఘటనను తెలిపారు.