4 Crores 50 Lakhs to Hospital in Krishna District :వెలగపూడి విజయలక్ష్మి భర్త పేరు వెలగపూడి ఉమామహేశ్వరావు వీరి స్వస్థలం కృష్ణా జిల్లాలోని యనమలకుదురు. ఏళ్ల క్రితమే వీరు విజయవాడలో స్థిరపడ్డారు. ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్న ఉమామహేశ్వరరావుకి విజయవాడతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరుంది. వ్యవసాయ బోర్ల మోటార్ల మరమ్మతులకు ఆయన్నే పిలిపించుకునేవారు. యనమలకుదురులో సరైన ఆసుపత్రి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం ఉమామహేశ్వరావును కలచి వేసేంది.
సొంత గ్రామానికి సరిగా వైద్య సేవలు అందట్లేదని అక్కడ ఆసుపత్రి కట్టించి ప్రజలకు సాయపడాలని అనుకునేవారు. ఆయన ఇద్దరు పిల్లలు బాగా చదువుకుని అమెరికాలో స్థిరపడటంతో పని నుంచి విరామం తీసుకున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన ఆలోచనని ఆచరణలో పెట్టడానికి ఇదే మంచి సమయం అనుకుని ప్రయత్నం మొదలు పెడదాం అనుకుంటుండగా గుండెపోటుతో చనిపోయారు. భర్త మరణాన్ని తట్టుకోలేక విజయలక్ష్మి మానసికంగా కుంగిపోయారు. తన భర్త భౌతికంగా ఎలాగూ దూరమయ్యారని ఆయన ఆశయాన్నైనా బతికించాలని ఆమె భావించారు.
భర్త ఆశయాన్ని విజయలక్ష్మి తన కొడుకులతో పంచుకోగా వారూ మద్దతు తెలిపారు. రెండు నెలల్లో వెలగపూడి ట్రస్టును ప్రారంభించిన ఆమె యనమలకుదురులో ఆసుపత్రి నిర్మాణానికి ఎలా ముందుకెళ్లాలో తెలుసుకున్నారు. అయితే ఆసుపత్రి నిర్మాణానికి స్థలం దగ్గరే తొలి సమస్య ఎదురైంది. విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న యనమలకుదురులో సెంటు భూమి కనీసం 20 లక్షలు పలుకుతోంది. ఎంత ప్రయత్నించినా ఆ ఊరికి దగ్గరగా భూమి లభించలేదు.
ఆసుపత్రి ఊరికి దూరంగా నిర్మాణం చేస్తే ప్రజలకు ఉపయోగడదనే ఆలోచనతో యనమలకుదురులో ఉండే భర్త ఉమామహేశ్వరరావు స్నేహితుడు నరసింహారావును సంప్రదించారు. ఆయన అప్పటి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి దృష్టికి ఆసుపత్రి నిర్మాణ అంశాన్ని తీసుకువెళ్లారు. దాతలు ముందుకు వచ్చి ప్రజలకు ఉపయోగపడే ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నందున యనమలకుదురు గ్రామ సచివాలయం ఆవరణలోని ఖాళీ స్థలంలో 36 సెంట్ల భూమిని కేటాయించారు. కట్టబోయే ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ నుంచి పట్టణ ఆరోగ్య కేంద్రంగానూ మంజూరు చేయించారు. అలా ఏడాది క్రితం శంకుస్థాపన జరిగి ఇటివలే ఆసుపత్రి నిర్మాణం పూర్తైంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌లు ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు.