Speciality Of Tirupati Venkateswara Swamy Garlands :అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామి పుష్పాలంకార ప్రియుడు. శ్రీనివాసునికి చేసే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది. పవిత్రమైన కార్యమని ”తిరువాయ్ మొళి” అనే ప్రాచీన తమిళ గ్రంథంలో కూడా పేర్కొన్నారు. స్వామివారి ఆపాదమస్తకం వివిధ రకాల సుగంధ భరిత కుసుమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించే ఈ పుష్పహారాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శిఖామణి:కిరీటం మీదనుంచి రెండు భుజాల మీది వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను ‘శిఖామణి’ అంటారు. ఇది ఎనిమిది మూరల దండ.
సాలిగ్రామ మాల:శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూవున్న సాలగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి రెండుమాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు.
కంఠసరి:శ్రీవారి మెడలో రెండు భుజాల మీదికి అలంకరించే దండ ఒకటి మూడున్నర మూరలు.
వక్షస్థల లక్ష్మీ: శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు రెండుదండలు, ఒక్కొక్కటి ఒకటిన్నర మూర.
శంఖుచక్రం: శంఖుచక్రాలకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒక మూర.
కఠారిసరం: శ్రీస్వామివారి బొడ్డునవున్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి. రెండు మూరలు.
తావళములు: రెండు మోచేతులకింద, నడుము నుంచి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ల నుంచి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే మూడు దండలు. అందులో మొదటిది మూడు మూరలు, రెండోది మూడున్నర మూరలు, మూడోది నాలుగు మూరలు.
తిరువడి దండలు: స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్క మూర. ప్రతి గురువారం జరిగే ”పూలంగి సేవ”లో మాత్రమే శ్రీస్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, పై పేర్కొన్న మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు.
ఇవిగాక శ్రీవారి ఆనందనిలయంలోని వివిధ ఉత్సవమూర్తులకు ఈ కింది విధంగా పూలమాలలు సిద్ధం చేస్తారు.
ఉత్సవమూర్తులకు నిత్యమూ అలంకరించే పూలదండల వివరాలు:
భోగ శ్రీనివాసమూర్తికి: ఒక దండ
కొలువు శ్రీనివాసమూర్తికి: ఒక దండ
శ్రీదేవి భూదేవి సహిత మలయ్పప్పస్వామికి: మూడు దండలు
శ్రీదేవి భూదేవి సహిత ఉగ్రశ్రీనివాసమూర్తికి: మూడు దండలు
శ్రీ సీతారామలక్ష్మణులకు: మూడు దండలు
శ్రీ రుక్మిణీ శ్రీకృష్ణులకు: రెండు దండలు