Vaikunta Ekadashi Tickets in Tirupati : తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చే జనవరి 10 వ తేదీ నుంచి 19 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ తేదీలను ప్రకటించింది. ఇవాళ వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యతో కలిసి అన్నమయ్య భవన్‌లో సమీక్ష జరిగింది. అందులో టికెట్ల జారీతో పాటు భక్తులకు ఏర్పాట్లు, సౌకర్యాలపై సమగ్రంగా చర్చించారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు :ఈనెల 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. మరుసటి రోజు అంటే 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్‌ఈడీ టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి.
మొత్తం 9 కేంద్రాల్లో టోకెన్ల జారీ :10 రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలైన ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌తో పాటు తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు కేటాయించనున్నారు. టోకెన్ జారీ కేంద్రాలకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంటున్నందున వారికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఈని ఆదేశించారు.
టోకెన్లు లేకుంటే నో ఎంట్రీ: ఈసారి టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతించనున్నారు. టోకెన్లు లేని భక్తులను దర్శన క్యూలైన్లలోకి అనుమతించేది లేదని ఈవో స్పష్టం చేశారు. అలాగే వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి. ఆ రోజు అధిక రద్దీ కారణంగా వేదాశీర్వచనం రద్దు చేశారు. ఏకాదశి రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు దేవదేవుడిని స్వర్ణరథంపై ఊరేగించనున్నారు.