Heavy Rush to Tirumala:తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. సంక్రాంతి సెలవులు, వారాంతం కావడంతో తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాలలో తరలి రావటంతో తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరిగిపోయింది. ఆదివారంతో వైకుంఠద్వార దర్శనం ముగియనుండటంతో టోకెన్లు కలిగిన భక్తులతో పాటు టోకెన్లు లేని భక్తులు తిరుమలకు తరలిరావడంతో భక్తుల సంఖ్య పెరిగింది.
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ పెరిగిపోవడంతో వాహనాల తనిఖీ కొంత ఆలస్యమవుతుంది. దీంతో వాహనాలు గో మందిరం వరకు బారులు తీరాయి. వాహనాలను తనిఖీ చేసి తిరుమలకు అనుమతించడానికి తితిదే అధికారులు చర్యలు చేపట్టి వాహన రద్దీని నియంత్రించారు. ఆదివారంతో వైకుంఠద్వార దర్శనం ముగియడంతో ఈ నెల 20న సర్వదర్శనం (ఎస్‍ఎస్‍డి) టోకెన్లను తిరుపతి కేంద్రాలలో జారీని నిలిపివేసింది. ప్రోటోకాల్ మినహ వీఐపీ బ్రేక్ దర్శనాలను ఈ నెల 20న టీటీడీ రద్దు చేసింది. ఆదివారం సిఫారసు లెటర్లను టీటీడీ స్వీకరించడం లేదు.
తొమ్మిదో రోజు: తిరుమలలో తొమ్మిదో రోజూ వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. 8వ రోజు శ్రీవారిని 61,142 మంది భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారికి 19,736 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారికి రూ.3.15 కోట్లు హుండీ ఆదాయం లభించింది.
ఆర్జిత సేవా టికెట్లు: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్లను శనివారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఏప్రిల్ 10 నుంచి 12 వరకు నిర్వహించనున్న స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలకు సంబంధించిన టికెట్లను జనవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కేటాయింపునకు సంబంధించి ఏప్రిల్ కోటాను జనవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
మరిన్ని శ్రీవారి సేవలు - టికెట్ల విడుదల తేదీలు
- అంగ ప్రదక్షిణం కోటా - జనవరి 23 - ఉదయం 10 గంటలకు
- శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటా - జనవరి 23 - ఉదయం 11 గంటలకు
- వృద్ధులు, దివ్యాంగుల దర్శనం కోటా - జనవరి 23 - మధ్యాహ్నం 3 గంటలకు
- ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల కోటా - జనవరి 24 - ఉదయం 10 గంటలకు
- తిరుమల, తిరుపతిలలో గదుల కోటా - జనవరి 24 - మధ్యాహ్నం 3 గంటలకు
- శ్రీవారి సాధారణ సేవ కోటా - జనవరి 27 - ఉదయం 11 గంటలకు
- శ్రీవారి నవనీత సేవ కోటా - జనవరి 27 - మధ్యాహ్నం 12 గంటలకు
- శ్రీవారి పరాకామణి సేవ కోటా - జనవరి 27 - మధ్యాహ్నం 1 గంటలకు
శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను టీటీడీ వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచించింది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు - ఏప్రిల్ కోటా టికెట్ల విడుదల తేదీలు ఎప్పుడంటే