V The Volunteer Organization Running Many Service Programs :ఉరుకుల పరుగల జీవితంలో సమయమంతా ఉద్యోగానికి సరిపోతుందనేది అపోహ మాత్రమే. ఎందుకంటే, చాలామంది యువత కొలువులు చేసుకుంటూనే సమాజానికి సేవచేసే కార్యక్రమాల్లో మమేకం అవుతున్నారు. ఆ యువకుడు సైతం అదే పనిలో పడ్డాడు. ఐటీ కొలువు చేస్తున్నా అందులో కావాల్సినంత ఆత్మసంతృప్తి దొరకలేదు. దీంతో వీటీవీవో అనే సేవా సంస్థను ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. మరి, ఆ సాఫ్ట్‌వేర్ సర్వీస్‌మెన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటో ఈ స్టోరీలో చూసేయండి.
వేలాది మంది యువతను భాగం చేసుకుని : సేవ చేయాలనే ఆలోచన ఉండాలే కానీ చేసేందుకు మార్గాలు అనేకం. అందులో భాగంగానే ఈ యువకుడు 15 రకాల సేవ కార్యక్రమాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. 'ద వాలంటీర్స్' అనే సేవా సంస్థను ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తానొక్కడే కాకుండా వేలాది మంది యువతను అందులో భాగస్వామ్యం చేస్తున్నాడు.
ఈ యువకుడి పేరు సురేంద్రన్ మురుగానంద కృష్ణన్. తమిళనాడులో పుట్టి, కర్ణాటకలో పెరిగాడు. ప్రస్తుతం బెంగుళూరులోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి తోటివారికి సాయపడే తపన ఈ యువకుడిది. అలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం మొదలు పెట్టాడు. అయితే, ఎక్కువ సంఖ్యలో సేవా కార్యక్రమాలు చేయాలంటే ఓ సంస్థను ఏర్పాటు చేస్తే బాగుందని వీటీవీవో ద వాలంటీర్ పేరుతో సేవా సంస్థను ప్రారంభించాడు.
రెండేళ్లలో 2500 యూనిట్ల రక్తం సేకరణ : వీటీవీవో స్థాపించిన వెంటనే సేవా కార్యక్రమాలు చేయడంలో నిమగ్నమయ్యాడు సురేంద్రన్. దాతల నుంచి రక్తం, ప్లేట్‌లెట్‌లు సేకరించడం, మూగజీవాలను సంరక్షించడం, చిన్నపిల్లలకు, వృద్ధులకు సేవలందించం వంటి 15 రకాల కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ రెండేళ్లలో 2500 యూనిట్ల రక్తం సేకరించాడు. సురేంద్రన్ చేస్తున్న కార్యక్రమాలు పలువురికి నచ్చడంతో ఇతనితో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చారు.
సేవా కార్యక్రమం చేయడానికి కొన్ని నెలల ముందే సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తాడు సురేంద్రన్. యువతను భాగస్వామ్యం చేసేలా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తాడు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాడు. ఈ కార్యక్రమాల్లో స్థానికులతో పాటు వందలాది వీటీవీవో వాలంటీర్లు భాగస్వామ్యం అవుతున్నట్లు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో పెద్దల జాతర :సేవాకార్యక్రమాల్లో భాగంగా వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు వినోదం పంచే కార్యక్రామాలకు శ్రీకారం చూట్టాడీ సామాజిక సేవా కార్యకర్త. అందులో భాగంగానే హైదరాబాద్‌లో పెద్దల జాతర నిర్వహించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమం జరిగడం ఇదే తొలిసారి. సిటీలోని 20 వృద్ధాశ్రమాల నుంచి దాదాపుగా 300 మంది వృద్ధులను ఒకచోట చేర్చాడు. వారికి ఆట పాట వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రవృద్ధులతే ప్రశంసలు అందుకున్నాడు.