Thermal Imaging Cameras Find Wires and Pipes : కరెంటు తీగలలో కంటికి కనిపించని లోపాలు అనేకం ఉంటాయి. ఈలోపాలను నిరంతరం విద్యుత్ సిబ్బంది పరిశీలిస్తున్నా, కొన్నింటిని మాత్రం పరిశీలించలేకపోతున్నారు. వీటి వల్ల తీగలు వేడెక్కడం, కాలిపోయి మంటలు రావడం, గృహోపకరణాలు కాలిపోవడం, నిత్యం విద్యుత్ అంతరాయం ఏర్పడడం వంటివి జరుగుతున్నాయి. వీటన్నింటిని అధిగమించేందుకు ఆ లోపాలను పరిశీలించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ థర్మల్ విజన్ కెమెరాలను వినియోగించనుంది. అయితే వాటిని ఎలా వాడుతారు? ఎక్కడ వాడతారు అనే విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం?
థర్మల్ విజన్ కెమెరాల వల్ల కంటికి కనిపించని లోపాలను గుర్తిస్తారు. ఆ కెమెరాల ద్వారానే స్కాన్ చేసి సమస్య ఎక్కడ ఉందో? ఎంత తీవ్రత ఉందో అర్థమవుతుంది. తద్వారా డిస్కం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంది. అయితే వీటిని ప్రతి సెక్షన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సిబ్బందికి పెను సవాల్‌గా లైన్లు గుర్తింపు : హైదరాబాద్ నగరంలో 57 వేల సర్క్యూట్ కిలోమీటర్ల ఎల్‌టీ లైన్లు, 22 వేల సర్క్యూట్ కిలోమీటర్ల 11 కేవీ లైన్లు, 5 వేల సర్క్యూట్ కిలోమీటర్ల 33 కేవీ తీగలు ఉన్నాయి. వీటిని విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నా, చాలా చోట్ల మాత్రం లోపాలను గుర్తించలేకపోతున్నారు. దీంతో తీగలు కాలిపోయి మంటలు రావడం, తీగలు వేడెక్కడం, మరమ్మతులకు ఎక్కువ సమయం పట్టడం, ఇంట్లో ఉండే వస్తువులు కాలిపోవడం జరుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు తీగలు కాలే దశకు ముందే నివారించే విధంగా డిస్కం ఆలోచన చేస్తోంది. ఇందుకు థర్మల్ విజన్ కెమెరాలు ప్రధాన పాత్ర వహిస్తాయని డిస్కం అభిప్రాయం.