KTR Election Campaign Protest in Bhainsa : సార్వత్రిక ఎన్నికల వేళ నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత చెక్‌పోస్ట్ కార్యాలయం కూడలి వద్ద కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఆ సమయంలో కొందరు కేటీఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆయన ప్రచారం వాహనం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఆయన ప్రసంగిస్తున్న సమయంలో, జనసమూహం నుంచి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు విసిరిన ఉల్లిగడ్డలు, టమాటలు ప్రచార వాహనం సమీపంలో కిందపడ్డాయి. కేటీఆర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా బహిరంగంగానే దాడి జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ పూర్తయిన తర్వాత పోలీసులు అందోళన కారులను చెదరగొట్టారు. రాముడిని ఆరాధించే వారు ఎవరూ ఇలా ప్రవర్తించారని కేటీఆర్ మండిపడ్డారు.
"శ్రీరాముడు అందరివాడు. కేవలం బీజేపీకే సొంతం కాదు. బాసరలో అమ్మవారు ఆలయం, కొండగట్టు అంజన్న దేవాలయం, తిరుపతి వెంకన్న కొండలు ఎప్పుడు వెలిశాయి. మరి బీజేపీ ఎప్పుడు ఏర్పాటైంది. నలభై ఏళ్ల క్రితం వచ్చిన వీళ్లే దేవాలయాలను కాపాడుతున్నట్లు బిల్డప్ ఎందుకు. అలానే ఇటువంటి పనికిమాలిన నిరసనకారులు ప్రతి దగ్గర కొందరు ఉంటారు. వారిని విడిచి మన పని మనం చేసుకొని ముందుకు సాగుదాం."-కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్