Ram Mohan Naidu on Ayyappa Devotees :అయ్యప్ప దీక్ష సమయంలో స్వామివారి దర్శనం కోసం విమానంలో ప్రయాణించే భక్తులు ఇక మీదట ఇరుముడిని చెకిన్ బ్యాగేజీలో కాకుండా తమ వెంట తీసుకెళ్లవచ్చని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఇప్పటివరకూ భద్రతా కారణాల రీత్యా ఇరుముడిని వెంట తీసుకెళ్లనిచ్చేవారు కాదని చెప్పారు. అయితే భక్తుల ఇబ్బందులు తెలుసుకొని వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అనంతరం శ్రీకాకుళంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ ఆయన ఇదే విషయాన్ని వెల్లడించారు.
మరోవైపు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.252 కోట్లతో త్వరలో ఆరు వరుసల రహదారి పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఇప్పటికే మూలపేట పోర్టు నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. దానికి దగ్గరలోనే విమానశ్రయం నిర్మించేందుకు స్థల పరిశీలన జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా ఉండడంతో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారని రామ్మోహన్ నాయుడు వివరించారు.
Ram Mohan on Srikakulam Development : తద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో రైతుల ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. త్వరలో జిల్లాలో ఉన్న నదుల అనుసంధానం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు మేలు చేకూరుస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.