Union Minister Raj Bhushan on Polavaram Project Progress :పోలవరం పనుల పురోగతిలో గత మూడు సంవత్సరాల్లో ఎన్నో సున్నాలు కనిపించాయి. కుడి ప్రధాన కాలువ ఎర్త్‌వర్క్ పనులు 2021-2024 మధ్య మూడు సంవత్సరాల్లో కాలంలో ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయాయి. కనీసం 1 శాతం పనులు కూడా ఇందులో జరగలేదు. లైనింగ్ పనులూ దాదాపు సున్నాలోనే ఉన్నాయి. కుడి ప్రధాన కాలువ పనులు 2021-22లో 1 శాతం జరిగితే, 2022-2023, 2023-2024ల్లో జీరోకే పరిమితమయ్యాయి.
ప్రాజెక్టును 2026 మార్చికల్లా పూర్తి చేయాలని నిర్ణయం :పోలవరం ప్రాజెక్టు పురోగతి గురించి ఒడిశా బీజేడీ రాజ్యసభ సభ్యుడు సస్మిత్ పాత్ర సోమవారం రాజ్యసభలో ప్రశ్నలు అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి రాజ్‌భూషణ్ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుత గడువు ప్రకారం మినిమం డ్రా డౌన్ లెవెల్ ఈఎల్ 41.15వరకు నీరు నిల్వ చేసేలా ప్రాజెక్టును 2026 మార్చికల్లా పూర్తి చేయాలని నిర్ణయించారని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యాలను గుర్తించే బాధ్యతను పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2021 ఆగస్టులో హైదరాబాద్ ఐఐటీకి అప్పగించిందని గుర్తు చేశారు. నిర్మాణ సంస్థను మార్చడం, భూసేకరణ, సహాయ, పునరావాసం నిదానంగా సాగడం, కొవిడ్ మహమ్మారి, దాని సంబంధ షరతులే పనుల జాప్యానికి ప్రధాన కారణమని, ఆ సంస్థ ఆ ఏడాది నవంబరులో సమర్పించిన నివేదికలో పేర్కొందని తెలిపారు. గోదావరి జల వివాద ట్రైబ్యునల్ తీర్పు 1980 ప్రకారం పోలవరం సాగునీటి ప్రాజెక్టు డిజైన్లను కేంద్ర జలసంఘం ఆమోదిస్తోందని రాజ్‌భూషణ్ చౌదరి తెలిపారు.
గత మూడు సంవత్సరాల్లో ప్రాజెక్టు కోసం విడుదల చేసిన నిధులు (రూ.కోట్లలో) : -
వివరం | 2021-22 | 2022-23 | 2023-24 |
హెడ్ వర్క్స్ | 623.17 | 1,217.43 | 20.66 |
ఎడమ ప్రధాన కాలువ | 0 | 0 | 20.39 |
కుడి ప్రధాన కాలువ | 0 | 0 | 0 |
భూ సేకరణ | 0 | 7.04 | 318.84 |
సహాయం, పునరావసం | 1,236.16 | 422.38 | 12.50 |
ఎస్టాబ్లిష్మెంట్ | 17.37 | 24.38 | 307.20 |
మొత్తం | 1,876.70 | 1,671.23 | 679.59 |
గత మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మాణ పురోగతి ఇలా : -
విభాగం | మొత్తం పరిమాణం | 2021-22 | 2022-23 | 2023-24 |
హెడ్ వర్క్స్ ఎర్త్ వర్క్ | 1,811.51 | 184.45 (10.18%) | 43.76 (2.41%) | 141.39 (7.80%) |
కాంక్రీట్ పనులు | 42.92 | 2.01 (4.68%) | 0.06 (0.14%) | 0.24 (0.56%) |
కుడి ప్రధాన కాలువ ఎర్త్ వర్క్స్ | 1,184.67 | 0 (0%) | 0 (0%) | 0 (0%) |
లైనింగ్ | 19.25 | 0.18 (0.94%) | 0.17 (0.88%) | 0(0%) |
నిర్మాణాలు (సంఖ్య) | 255 | 1 (0.39%) | 0 (0%) | 0 (0%) |
ఎడమ ప్రధాన కాలువ ఎర్త్ వర్క్ | 1,095.6 | 1.22 (0.11%) | 1.37 (0.13%) | 0.7 (0.06%) |
లైనింగ్ | 15.15 | 0.17 (1.12%) | 0 (0%) | 0.009 (0.06%) |
నిర్మాణాలు (సంఖ్య) | 451 | 1(0.22%) | 9 (2.00%) | 5 (1.11%) |
భూసేకరణ (ఎకరాలు) | 1,27.262.79 | 277.91 (0.22%) | 0(0%) | 5.10 (0.004%) |