Union Minister Kishan Reddy Started Development Works in Musheerabad : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీకీ, జలమండలికీ ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌లో మురుగునీటి అభివృద్ధి పనులను, దోమలగూడ ఈ సేవ పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అలాగే ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రజాప్రతినిధులు కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, కార్పొరేటర్లు పావని, రచనశ్రీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 30 శాతం మంది ప్రజలు నివాసం ఉంటున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ, జలమండలిలో నిధుల కొరతతో ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ, జలమండలిలకు అత్యధిక నిధులు మంజూరు చేయాలని ఆయన విన్నవించారు. అనేక ప్రాంతాలు కాంక్రీట్ జనరల్‌గా మారుతున్నాయని ఆవేదన చెందారు.
ఇలా కాంక్రీట్ జనరల్‌గా మారడం వల్ల భూతాపం పెరగడానికి మొక్కలు పెంచకపోవడమే అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అమ్మ పేరుపై ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని ఇచ్చిన పిలుపుమేరకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. 100 మొక్కలు నాటకుండా ఒక్క మొక్కను నాటి వాటిని జీవించే విధంగా ప్రతినిత్యం పర్యవేక్షించాలని ఆయన సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు భావితరానికి ఎంతో మేలు చేసిన వారిమి అవుతామని వివరించారు.