Kishan Reddy fires on CM Revanth : బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో విలీనం కాబోతుందంటూ వస్తున్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ బీజేపీ అధికార ప్రతినిధులుగా తయరయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని కేటీఆర్ పరస్పర విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో విలీనం ఎట్టి పరిస్థితుల్లో జరగదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలాగే, నేటి కాంగ్రెస్ పాలన సాగుతోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చి, నేడు వాటి అమలులో ఘోరంగా విఫమలయ్యారని ఆయన విమర్శించారు. హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు.
కాశ్మీర్లో అంబేడ్కర్ రాజ్యాంగం : నగరంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యశాలలో పాల్గొన్న కిషన్‌రెడ్డి, ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. సెప్టెంబర్‌లో జమ్మూ కాశ్మీర్లో మూడు దశల్లో పోలింగ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిన్నా రాజ్యాంగాన్ని, 370 ఆర్టికల్ తొలగించి అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షం జమ్మూ కశ్మీర్లో అధికారంలోకి వస్తే మళ్లీ 370 ఆర్టికల్‌ను తీసుకువస్తుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేస్తామని ఆపార్టీ చెబుతోందని మండిపడ్డారు.