BUDAMERU LEAKAGE WORKS ON FAST :మంత్రులు లోకేశ్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు రేయింబవళ్లు అక్కడే ఉండి రెండు గండ్లు పూడ్చివేయించారు. మూడవ గండి పూడ్చివేత పనులు ప్రారంభమయ్యాయి. డ్రోన్ లైవ్ ద్వారా సూచనలు ఇస్తూ పనులను లోకేశ్ పర్యవేక్షిస్తున్నారు. గండ్ల పూడ్చివేత పురోగతిపై మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి కమాండ్ కంట్రోల్ నుంచి లోకేశ్ సమీక్షించారు.
విజయవాడ సింగ్ నగర్‌కు వరద ముంపును నియంత్రించేలా మూడో గండి పూడిక పనులు సైతం శరవేగంగా జరుగుతుండగా పనులను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లతో కలసి పర్యవేక్షించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి బుడమేరు గండ్ల పూడిక పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి పనులను ఎప్పటికప్పుడు లైవ్ లో పరిశీలిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
వాన కురుస్తున్నా, వరద పోటెత్తుతున్నా, చీకట్లు కమ్ముకున్నా మంత్రి రామానాయుడు మాత్రం బుడమేరు కాల్వ గట్ల నుంచి కదలడం లేదు. బుడమేరు కట్టపైనే భోజనం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు విజయవాడలో అధికారులతో సమీక్షిస్తుంటే, మంత్రి క్షేత్ర స్థాయిలో తిరుగుతున్నారు. దగ్గరుండి చేయిస్తేనే ఏ పని అయినా త్వరగా అవుతుందన్నది ముఖ్యమంత్రి నమ్మకమని, అదే స్ఫూర్తిని పాటిస్తున్నానని చెప్పారు. అన్ని గండ్లు పూడ్చిన తర్వాతే నగరానికి వస్తానని మంత్రి రామానాయుడు చెప్పారు.