Two Young Men died in Road Accident : వారిద్దరూ అవివాహితులు. వరుసకు బావ - బావమరుదులు. సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుని సంతోషంగా బైక్‌పై ఇంటి బాట పట్టారు. బూడిద లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించేలా చేసింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ బాధిత కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. టేకులపల్లి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముత్యాలంపాడు పంచాయతీ పడమటిగుంపునకు చెందిన మోకాళ్ల బుచ్చయ్య, భద్రమ్మ దంపతుల కుమారుడు భద్రం(32), వాసం సీతారాములు, గంగ దంపతుల కుమారుడు సాయి (23), వీరిద్దరూ బావ-బావమరుదులు. బొగ్గు లారీలపై డ్రైవర్, క్లీనర్లుగా పని చేస్తుంటారు.
ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకునేందుకు గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రోళ్లపాడు బస్‌స్టాప్ వద్ద వీరి వాహనాన్ని కొత్తగూడెం నుంచి ఇల్లెందు వైపు వెళ్తున్న బూడిద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భద్రం తల నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి కుడి కాలుకు తీవ్ర గాయమైంది. అతణ్ని ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన అతణ్ని ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనపై విచారణ చేపట్టినట్లు టేకులపల్లి ఎస్సై తెలిపారు.
విషాదం :ప్రమాదంలో చనిపోయిన ఇద్దరివీ పేద కుటుంబాలే. భద్రానికి అక్క, చెల్లి ఉన్నారు. వీరిద్దరికీ వివాహాలయ్యాయి. ఒక్కగానొక్క కుమారుడు విగత జీవిగా మారటంతో భద్రం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో యువకుడు సాయికి వివాహమైన అక్క ఉంది.