Two Trains on Tracks at a Time in Visakha Railway Station :రైళ్లలో ప్రయాణమంటేనే టెన్షన్ వాతావరణం ఉంటుంది. ప్రయాణానికి ముందు బయల్దేరినా సమయానికి చేరుకుంటామో లేదోనని ఆందోళన ప్రయాణికుల్లో ఉంటుంది. తీరా స్టేషన్‌కు చేరుకున్న తర్వాత తాము ఎక్కాల్సిన ట్రైన్ ఏ ప్లాట్‌ఫామ్ ఆగిందో తెలుసుకోవాలి. ఓ వైపు టైమ్ అయిపోతుంటుంది. మరోవైపు రైలు ఎక్కడ ఉందో తెలుసుకుని ఎక్కాలి. లేకపోతే ట్రైన్ మిస్ కావాల్సిందే.
ఓ వైపు ప్రయాణికులు ఇంత టెన్షన్ పడుతుండగా తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉన్న అధికారుల వింత చర్యలతో ఆ తిప్పలు మరింత పెరుగుతున్నాయి. విశాఖలోని రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌ల కొరత నెపంతో అక్కడి నుంచి రెండు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను ఒకే సమయంలో ఒకదాని వెనక మరొకటి ఉంచడంతో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ముందుగా వెళ్లాల్సిన విశాఖ - భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఏడో నంబర్ ప్లాట్ ఫామ్‌కు ముందు వైపు ఉంచారు. అదే సమయంలో విశాఖ నుంచి దుర్గ్ వెళ్లాల్సిన రైలు బోగీలను దాని వెనుకనే నిలుపుతున్నారు.