తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకరు కళాశాలకు - మరొకరు గురుకులానికి - చివరకు అంతా కలిసి అనంతలోకాలకు

పక్కింటి యువకుడి బైకు ఎక్కిన విద్యార్థులు - బస్సు ఢీకొని ముగ్గురూ దుర్మరణం - వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలో ఘటన

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

ROAD ACCIDENT IN VIKARABAD TODAY
Three Persons Died in Road Accident in Vikarabad (ETV Bharat)

Three Persons Died in Road Accident in Vikarabad :ఆర్టీసీ బస్సు, బైక్​ ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడితో సహా యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా మరో యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలారు. ఈ విషాదకర ఘటన వికారాబాద్​ జిల్లాలోని పూడూరు మండలం పూడూరు గేటు వద్ద గురువారం జరిగింది. ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గొంగుపల్లికి చెందిన ఎం.ప్రవీణ్‌(21) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అతడికి భార్య ఏడాది కుమారుడు ఉన్నారు. రెండు రోజుల కిందట మేడికొండలోని తన అమ్మమ్మ ఊరిలో ఓ శుభాకార్యానికి ఒంటరిగా వెళ్లారు.

మళ్లీ తిరుగు ప్రయాణంలో అదే గ్రామానికి చెందిన విద్యార్థులు వికారాబాద్‌ వైపు వెళ్లాల్సిన చిల్కమర్రి నవీన్‌కుమార్‌(20), బుడ్డమొళ్ల హర్షవర్ధన్‌(15) తమను మన్నెగూడ వరకు లిఫ్ట్​ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో ప్రవీణ్‌ కాదనలేకు ఇద్దరిని తన బైక్​పై ఎక్కించుకున్నారు. గ్రామం నుంచి దాదాపు నాలుగు కిలో మీటర్ల దూరంలోని హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. పూడూరు గేటు వద్దకు చేరుకోగానే హైదరాబాద్‌ నంబర్​-1 డిపోనకు చెందిన ఆర్టీసీ ఎక్స్​ప్రెస్​ బస్సు సేడం వెళ్తుండగా ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో నవీన్, హర్షవర్ధన్‌ అక్కడికక్కడే మృతి చెందగా వాహనాన్ని నడిపిన ప్రవీణ్‌ తీవ్రంగా గాయపడ్డారు.

పరారీలో డ్రైవర్​ : ఆ సమయంలో అంబులెన్స్​ అందుబాటులో లేకపోవడంతో అక్కడున్న స్థానికులు వెంటనే ప్రవీణ్​ను పరిగి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సీ నారాయణరెడ్డి, డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద కారణాల్ని సీఐ, ఎస్సైలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ఆర్టీసీ అధికారులు రూ.10 వేల చొప్పున సహాయం అందించారు. కాగా డ్రైవర్​ పరారీలో ఉన్నారు.

కాలేజీకి వెళ్తూ : మేడికొండకు చెందిన చిల్కమర్రి యాదయ్య, అంజమ్మలకు ముగ్గురు కుమారులు. వారిలో నవీన్‌కుమార్‌ చిన్నవాడు. ప్రస్తుతం అతడు వికారాబాద్‌లోని శ్రీ అనంతపద్మనాభ కాలేజీలో డిగ్రీ ఫైనల్​ ఇయర్​ చదువుతున్నాడు. మరోవైపు ఆర్మీ ఉద్యోగ పరీక్షలకు సైతం సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో దసరా సెలవులు ముగిసిపోవడంతో కళాశాలకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌ను లిఫ్ట్​ అడిగాడు.

బైక్​ ఎక్కి తిరిగిరాని లోకానికి : మేడికొండకు చెందిన బుడ్డమొళ్ల చిన్న నర్సింలు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వారు కూలీ పనులు చేసుకుంటున్నారు. పెద్ద కుమారుడు స్థానిక పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. చిన్నకుమారుడైన హర్షవర్ధన్‌ వికారాబాద్‌లోని అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు అయిపోవడంతో గురుకులానికి వెళ్లేందుకు ప్రవీణ్‌ను లిఫ్ట్​ అడిగాడు. ద్విచక్ర వాహనంపై ఎక్కిన హర్షవర్ధన్‌ తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఇద్దరూ పక్కపక్క నివాసాల్లో ఉండడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

ఆధారం కోల్పోయిన కుటుంబం :ప్రవీణ్​కుమార్​కు రెండేళ్ల క్రితం దోమ మండలం దాదాపూర్‌కు చెందిన అఖిలతో వివాహమైంది. వారికి ఏడాది కుమారుడు ఉన్నాడు. భార్య, కుమారుడు ఇద్దరూ దసరాకు పుట్టింటికి వెళ్లారు. ఈ క్రమంలో భర్త ఒక్కడే శుభకార్యానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదంలో తన భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తాము ఆధారం కోల్పోయామని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

గుంతలో పడి గాల్లోకి ఎగిరిన కారు - మెదక్ జిల్లాలో ఏడుగురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details