Garbage Issue in Tirumala :శ్రీవారు కొలువైన తిరుమల కొండపై గత ఐదు సంవత్సరాలు వ్యర్థాల తొలగింపును నిర్లక్ష్యం చేశారు. దీంతో అవి గుట్టల్లా పేరుకుపోయి కాలుష్యం వెదజల్లాయి. మరోవైపు డంపింగ్ యార్డ్ సమీపంలోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న స్థానికులూ ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ క్రమంలోనే టీటీడీ నూతన పాలకవర్గం వ్యర్థాల తొలగింపు పనులను వేగవంతం చేసింది. తిరుమలను ప్రతిరోజూ 70,000ల నుంచి లక్ష మంది భక్తులు సందర్శిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ 80 టన్నుల వరకు తడి, పొడి చెత్త వస్తోంది. ఇందులో తడిచెత్త అత్యధికంగా 57 టన్నులు, పొడిచెత్త 20 టన్నుల నుంచి 22 టన్నుల వరకు ఉంటోంది. వాటిని ఏ రోజుకారోజు తొలగించడం కీలకం.
2.5 లక్షల టన్నుల మేర : కాకులమాను యార్డ్ వద్ద 20 సంవత్సరాలుగా పేరుకుపోయిన 2.50 లక్షల టన్నుల వ్యర్థాలు తిరుమల వాతావరణాన్ని కలుషితం చేసేవి. వాటిని తొలగించడానికి టీటీడీ నూతన పాలకులు, అధికారులను సమాయత్తం చేశారు. ప్రత్యేకంగా కాంట్రాక్టర్‌ను ఏర్పాటు చేశారు. గత నవంబర్‌లో ఈ పనులు ప్రారంభించగా, ఇప్పటివరకు రెండు లక్షల టన్నులు తొలగించారు. మిగిలిన 50,000ల టన్నులను వీలైనంత త్వరగా తరలించనున్నారు.
యార్డ్‌లోని వ్యర్థాల తరలింపు, నిర్వహణపై టీటీడీ డీఆర్‌డీఓ సహకారాన్ని కోరింది. ఇటీవలే డీఆర్‌డీఓ మాజీ ఛైర్మన్, రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు డా.సతీష్‌రెడ్డితో కలిసి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్థానిక యార్డును పరిశీలించారు. నిపుణుల పరిశీలన అనంతరం సమగ్ర ప్రతిపాదనలు టీటీడీకి అందజేసేందుకు డీఆర్‌డీఓ సిద్ధమైంది. దీంతోపాటు తిరుమలలో ఏరోజు చెత్తను ఆ రోజే వేరుచేసి తరలించే విధానాన్ని ప్రతిపాదించనున్నారు.