TTD Srivari Sarva Darshanam From 20th of This Month :శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 19న ముగియనున్న నేపథ్యంలో సర్వదర్శన ఏర్పాట్లపై అదనపు ఈవో వెంకయ్యచౌదరి, ఇతర అధికారులతో కలిసి టీటీడీ ఈవో జె.శ్యామలరావు గురువారం సమీక్షించారు. తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ శుక్రవారం ముగిసే అవకాశం ఉందని ఈవో తెలిపారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 20న సర్వదర్శనం కోరే భక్తులకు 19న తిరుపతిలో సాధారణ ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయరని తెలిపారు.
భక్తులు సర్వదర్శనం క్యూలైన్‌లో ప్రవేశించి నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 19న ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయరు. 20న టీటీడీ ప్రొటోకాల్ భక్తులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. ఈ కారణంగా 19న వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫారసు లేఖలూ స్వీకరించరని ఈవో పేర్కొన్నారు. సమావేశంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ మణికంఠ, ఐటీ జీఎం శేషారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.